(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రత్యేక ప్రతినిధి)
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల పునర్విభజన చేస్తామని ప్రకటన చేసింది. దీనిపై కొంతకాలంగా స్తబ్ధత నెలకొన్నా తాజాగా అధికారుల సర్వేలు, వివరాల సేకరణ నేపథ్యంలో ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏం జరుగుతుందోననే ఉత్కంఠ జిల్లా వాసుల్లోనూ ఏర్పడింది. అధికారులు బయటకు చెప్పకపోయినా శాఖల వారీగా కదలిక ప్రారంభమైంది. పునర్విభజనపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల భవనాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలున్నాయి? సొంత భవనాలెన్ని? ప్రభుత్వ భూముల లెక్కలు సహా ఇతర వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు.
జిల్లాకు తీవ్ర నష్టం
పార్లమెంటు నియోజకవర్గాన్ని ప్రామాణికంగా తీసుకుని జిల్లాల పునర్విభజన చేపడతామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆ తరహా విభజనే జరిగితే అన్ని ప్రాంతాలకూ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఆర్థికంగా పరిపుష్టి సాధించి పెడుతున్న ప్రధాన పారిశ్రామిక ప్రాంతమంతా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉంది. విద్యా సంస్థలు ఇక్కడే ఉన్నాయి. రాజాం విద్య, వైద్య పరంగా అభివృద్ధి చెందింది. ఈ రెండూ విజయనగరం జిల్లాలో కలిసి పోతాయనే వాదనలున్నాయి. పార్వతీపురాన్ని జిల్లాగా చేసేందుకు, అందుకు అవసరమయ్యే వనరులపైనా అధికారులు ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాలకొండ నియోజకవర్గాన్ని అందులో కలపనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. వెనుకబడిన జిల్లా, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతంగా కొనసాగుతున్న శ్రీకాకుళాన్ని విభజన చేస్తే అభివృద్ధిపై ప్రభావం చూపుతుందని జిల్లా నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు ఎచ్చెర్ల శ్రీకాకుళానికి జీవనాడిగా ఉందని, దానిని పక్క జిల్లాలో కలపొద్దని కోరుతూ అక్కడ పాదయాత్రలు జరుగుతున్నాయి. పలువురు టీడీపీ నేతలూ విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులు మాత్రమే పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశాలొచ్చాయని, ఎన్ని జిల్లాలు అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని మరొకవైపు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
పలాస కేంద్రంగా ..
శ్రీకాకుళం జిల్లాను రెండుగా విడగొట్టి పలాస కేంద్రంగా వేరొక జిల్లాను రూపొందించనున్నట్లు సోషల్ మీడియాలో కొద్దిరోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. పలాస పరిధిలో ఇచ్చాపురం, పాతపట్నం, టెక్కలి, పలాస అసెంబ్లీ నియోజకవర్గాలను కలపనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం కేంద్రంగా శ్రీకాకుళం, నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ, ఎచ్చెర్ల నియోజకవర్గాలు ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే సమస్య సద్దుమణిగే పరిస్థితి కనిపిస్తోంది.
ఏదేమైనా జిల్లాల పునర్విభజన అంశం శ్రీకాకుళంలో ఆరని రావణకాష్టంలా తయారవ్వడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.