ఎస్వీబీసీ మాజీ ఛైర్మన్, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ కు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు లేవు. వరుసగా ఏదో ఒక సంఘటన జరగడం, ఆయన వార్తల్లోకి ఎక్కడం ఈ మధ్య తరచూ జరుగుతోంది. ఈరోజు ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారు ఢీకొన్నాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పృథ్వీ కారు పూర్తిగా ధ్వంసమైంది. పృథ్వీ తన కారులో క్యాన్సర్ ఆస్పత్రి సమీపంలోని వినాయకుడి గుడి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో స్థానిక జనం అక్కడ పెద్ద ఎత్తున గుమికూడారు.
ప్రమాదానికి గురైన కారు ఫొటోను పృథ్వీరాజ్ టీమ్ ఫేస్బుక్లో షేర్ చేశారు. దాదాపు ఏడు నెలలుగా షూటింగులు కూడా లేవు. దాంతో పృధ్వీరాజ్ అంత యాక్టివ్ గా కూడా లేరు. ఈ ఏడాది అగస్టులో ఆయన కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కోలుకున్నారు. గతంలో ఎస్వీబీసీ ఛైర్మన్గా పనిచేసినపుడు ఓ మహిళతో మాట్లాడిన ఆడియో టేపుల వ్యవహారం బయటపడింది. అలా తన పదవికి కూడా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ ఆడియో టేపుల్లో ఉన్నది తన గొంతు కాదని పృథ్వీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు.
అధిష్ఠానం మాత్రం ఆయనతో రాజీనామా చేయించింది. కావాలనే తనను ఇరికించారంటూ పృథ్వీ అప్పట్లో ఆరోపణలు చేశారు. తనకు ఎస్వీబీసీ ఛైర్మన్ రావడం కొందరికి నచ్చలేదని, కుట్రపన్ని ఆడియో టేపు లీకేజీ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు. ఇలా వరస సంఘటనలు పధ్వీరాజ్ కు తలనొప్పిగా మారాయి. తాజా ఈ కారు ప్రమాదం. ఆయన కారును ఇంకో కారు గుద్దిందని అంటున్నారు. ఆయన రాజకీయంగా కూడా చురుకుగా లేరు.