ఏ విషయంపైనైనా సూటిగా సుత్తిలేకుండా మాట్లాడ్డం పూరి ప్రత్యేకత. మ్యూజింగ్స్ పెట్టిన తర్వాత అతడి ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిపోయింది. రకరకాల అంశాలను తనదైన స్టయిల్ లో విశ్లేషించే పూరీ జగన్నాధ్, ఈసారి హీరోయిన్లపై కామెంట్స్ చేశాడు.
హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే తనకు నచ్చదంటున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. తనదైన స్టయిల్ లో తన వాదనను సమర్థించుకుంటున్నాడు. ప్రేక్షకుల దృష్టిలో హీరోయిన్లు దేవతలతో సమానమని, అలాంటి దేవతలు గర్భవతులుగా మెటర్నటీ వార్డుల్లో చూడలేనంటున్నాడు.
“లక్ష్మి, పార్వతి, సరస్వతి లాంటి దేవతలు గర్భం దాల్చలేదు. మెటర్నటీ వార్డుల్లో లేరు. కనీసం కిచెన్ లో కూడా లేరు. ప్రేక్షకుల దృష్టిలో హీరోయిన్లు కూడా అంతే. ఫ్యాన్స్ పర్సుల్లో, మొబైల్ స్క్రీన్స్ పై ఉన్న హీరోయిన్లు దేవతలతో సమానం. అలాంటి దేవతలు మెటర్నటీ వార్డుల్లో నొప్పులు పడుతుంటే నేను చూడలేను. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు మాత్రమే ఉంటుంది. దేవతలకు ఉండదు. కాబట్టి దేవతల్లాంటి హీరోయిన్లు కూడా పెళ్లిళ్లు చేసుకోకూడదు.”
కోటి మంది అమ్మాయిల్లో ఒక్క అమ్మాయికి మాత్రమే హీరోయిన్ ఛాన్స్ దక్కుతుందని.. అలాంటి స్పెషాలిటీని పెళ్లి చేసుకొని, గర్భందాల్చి పోగొట్టుకోవద్దని చెబుతున్నాడు పూరి జగన్నాధ్. నార్మల్ గర్ల్స్ తో పోలిస్తే హీరోయిన్లు మానసికంగా బలంగా ఉంటారని, కాబట్టి కనీసం హీరోయిన్లయినా మగాళ్లను దూరం పెట్టాలని కోరుతున్నాడు.
“కనీసం హీరోయిన్లయినా మగాళ్లను దూరం పెట్టాలి. ప్రేమ లేకపోతే చచ్చిపోతారా. సింగిల్ ఉమెన్ రైజ్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది ఉన్నారు స్ఫూర్తి ఇవ్వడానికి. వీళ్లకు మగాళ్లు అవసరం లేదు. హాలీవుడ్ లో పెళ్లి పక్కనపెట్టిన స్టార్స్ చాలామంది ఉన్నారు. నిక్కీ మినాజ్, రిహన్నా, క్యాటీ పెర్రీ, జెన్నిఫర్ లారెన్స్, లేడీ గాగా, శాండ్రా బుల్లక్.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి.”
ఈ దేశానికి స్ట్రాంగ్ ఉమెన్, ఇండిపెండెంట్ ఉమెన్, సింగిల్ ఉమెన్ అవసరం చాలా ఉందంటున్నాడు పూరి జగన్నాధ్. అమ్మాయిలు స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే, మంగళసూత్రం మరిచిపోవాలని అంటున్నాడు. ఇలాంటి అమ్మాయిలే దేశాన్ని మారుస్తారని చెబుతున్నాడు.
“రంభ, ఊర్వశి, మేనక పెళ్లి చేసుకోలేదు. వాళ్లు కూడా పెళ్లి చేసుకొని ప్రెగ్నెంట్ అయితే ఇక స్వర్గం ఎందుకు? మనిషి చచ్చి స్వర్గానికి వెళ్తాడంటారు. ఇక వాళ్లు గర్భవతులైతే మనిషి చావడానికి కూడా ఇష్టపడడు. సింగిల్ ఉమెన్ కు అంత శక్తి ఉంది. నా మాట వినండి, స్ట్రాంగ్ గా ఉండాలనుకుంటే పెళ్లి చేసుకోవచ్చు.”
Must Read ;- విజయ్ – పూరి లైగర్ మూవీలో మైక్ టైసన్