స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్ పాత్రను అల్లు అర్జున్ పోషిస్తున్నా సంగతి తెలిసిందే. క్రిస్మస్ కు అనుకున్న ఈ సినిమాని ఇంకా ముందే విడుదల చేయాలని నిర్ణయించారు. డిసెంబరు 17న ఈ సినిమా విడుదలవుతోంది. అదికారికంగా ఈ తేదీని ప్రకటించారు. సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ఫస్ట్ సింగిల్ విడుదలయ్యాయి.
అలాగే ఇందులో హీరోయిన్ గా నటించిన రష్మిక లుక్ కూడా ఇటీవల విడుదలైంది. పల్లెటూరి అమ్మాయి శ్రీవల్లిగా ఆమె పాత్రను రివీల్ చేశారు. అలాగే భన్వర్ సింగ్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రను మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పోషించారు. ఫాహద్ ఫాజిల్ కు తెలుగులో ఇదే మొదటి సినిమా అని చెప్పాలి. డబ్బింగ్ చిత్రాల ద్వారా ఫాహద్ అందరికీ తెలుసు. ఫాహద్ ఇందులో విలన్ గా నటించారు. రెండు భాగాలుగా పుష్ప విడుదలవుతోంది. మొదటి భాగాన్ని ‘పుష్ప – ది రైజ్’ పేరుతో విడుదల చేస్తున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలో ఓ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో విలన్ పాత్రకు సంబంధించి రెండు రకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఒకటి నటుడు సునీల్ కూడా విలన్ గా నటిస్తున్నారనేది. సినిమా మొదటి పార్ట్ లో సునీల్ ఉంటారని, రెండో భాగంలో ఫాహద్ ఫాజిల్ రంగ ప్రవేశం చేస్తారని సమాచారం. బహుశా ఫాహద్ పాత్ర రంగ ప్రవేశంతో మొదటి భాగం పూర్తి కావచ్చు.
అల్లు అర్జున్ కు మలయాళంలో మంచి పేరుంది. అక్కడ మల్లు అర్జున్ అని పిలుస్తుంటారు. ఫాహద్ కు మలయాళంలో ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకే సినిమాలో ఉంటే సినిమా మీద కేరళలలో మరింత క్రేజ్ రావచ్చన్న ఉద్దేశంతోనే ఫాహద్ ను తీసుకున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.
Must Read ;- సీఎం జగన్ పై అల్లు అరవింద్ ఏమన్నారంటే..











