Puvvada Ajay Kumar Meets Jr. NTR With His Son :
టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన వారసుడు పువ్వాడ నయన్ భవిష్యత్తుపై ఓ క్లారిటీకే వచ్చినట్టుగా తెలుస్తోంది. తనలా తన తనయుడిని రాజకీయాల్లోకి కాకుండా సినిమా రంగంలోకి పంపే దిశగా పువ్వాడ అడుగులు వేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా సోమవారం నాడు నయన్ ను వెంటబెట్టుకుని కేటీఆర్ ను కలిసిన పువ్వాడ.. అదే క్రమంలో సినీ రంగానికి చెందిన ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలతో భేటీ అయ్యారు. ఈ మేరకు వారితో కలిసి తండ్రీకొడుకులిద్దరూ కలిసి దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పువ్వాడ వారసుడి ఫ్యూచర్ ప్లానింగ్ పై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
జూనియర్ ఎన్టీఆర్, చిరులతో భేటీ
పువ్వాడ నవీన్ పుట్టిన రోజు జూలై 5. అంటే.. సోమవారం ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తన కుమారుడిని వెంటబెట్టుకుని బయలుదేరిన పువ్వాడ.. నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ప్రముఖ చిత్ర దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారట. తన కొడుకును ఆశీర్వదించాలని ఎన్టీఆర్ ను కోరిన పువ్వాడ.. ఆయన ఆశీస్సులు తీసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి ఇంటికీ వెళ్లారు. అక్కడా అదే రీతిన నయన్ కు చిరు ఆశీస్సులు తీసుకున్న పువ్వాడ.. ఆ తర్వాత మరికొందరు సినీ ప్రముఖులను కూడా కలిసినట్లుగా తెలుస్తోంది.
ఆశీస్సుల కోసమే వెళ్లారా?
ఇక తాను రాజకీయాల్లో ఉన్న నేపథ్యంలో అజయ్ తన కొడుకును మంత్రి కేటీఆర్ వద్దకు కూడా తీసుకెళ్లారు. కేటీఆర్ ఆశీస్సులు తీసుకున్న తర్వాత తిరిగి వచ్చిన పువ్వాడ.. ఈ ముగ్గురితో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలకు పువ్వాడ పెట్టిన కామెంట్ ఏమిటంటే.. ‘‘నా తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది. రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది’ అంటూ పువ్వాడ ట్వీట్ చేశారు. ఈ ఫొటోలు చూసిన వెంటనే… పువ్వాడ నయన్ త్వరలోనే సినిమాల్లోకి అడుగు పెట్టడం ఖాయమేనన్న రీతిలో నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.
Must Read ;- వికీపీడియాలో టాప్-5 సౌత్ హీరోలు వీళ్లే