ఏపీలో జరిగిన వేల కోట్ల లిక్కర్ స్కామ్‌లో త్వరలోనే పెద్ద తలకాయలు అరెస్టవుతారంటూ ఏపీ బీజేపీ నేత PVN మాధవ్ చేసిన ప్రకటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఈ కుంభకోణంలో కింది స్థాయి వ్యక్తులు, బినామీలు చిక్కుకుంటున్నప్పటికీ, అసలు సూత్రధారులైన కీలక నేతలపై కూడా త్వరలోనే చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన సంకేతాలు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
పెద్ద తలకాయలు అంటే ఎవరనేది బీజేపీ నేత మాధవ్‌తో పాటు కూటమి పెద్దలందరికీ స్పష్టమైన అవగాహన ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, స్థానిక రాజకీయ సమీకరణాలు, పరిణామాలరీత్యా రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థలు ఆ పెద్దల జోలికి వెళ్లడానికి కొంత సంకోచిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. అందుకే ఈ కేసులో అసలు దోషుల ఆట కట్టించాలంటే కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థల ఎంట్రీ ద్వారానే సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాధవ్ తాజా ప్రకటన సరిగ్గా ఇదే దిశగా సంకేతాలు ఇస్తోందనే చర్చ జరుగుతోంది.
మరోవైపు, ఈ పెద్ద తలకాయగా ప్రచారంలో ఉన్న సదరు కీలక నేత ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడం, అలాగే మతమార్పిడి మాఫియాకు పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పెద్దలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. కేవలం లిక్కర్ స్కామ్ మాత్రమే కాకుండా, ఈ పరిణామాలు కూడా సదరు నేత మెడకు చుట్టుకునే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
ఇది కేవలం రాజకీయ లబ్ది కోసం ఆడుతున్న మైండ్ గేమా? లేక నిజంగానే రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే సంచలన అరెస్టులకు రంగం సిద్ధమవుతోందా? అన్నదానికి త్వరలోనే స్పష్టత రానుంది. ఏదేమైనా మాధవ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టించడంతో పాటు, రాబోయే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.











