ఏపీలో పాఠశాలలు నవంబరు 2 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ఇంగ్లీష్ మీడియం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంయమనం పాటించాలి. ఈ కేసు విషయం ఇప్పటికే సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. రాజ్యాంగ విరుద్ధంగా ఇంగ్లీష్ మీడియం అమలు చేయొద్దు. ఒక వేళ అలాంటి పనులు చేస్తే అది కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తుంది. ఎన్నికల నిర్వహణ విషయంలో ద్వంద్వ విధానంతో అంబటి రాంబాబు వ్యవహరిస్తున్నారు. పాఠశాలలు తెరవడానికి ఇంత సమయం పట్టిన మీకు లిక్కర్ షాపులు తెరవడానికి ఎందుకు పట్టలేదు. అంటే పాఠశాలలు తెరిస్తే కరోనా వ్యాపిస్తుందా? లిక్కర్ షాపులు తెరిస్తే వ్యాపించదా? అంటూ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రశ్నించారు.
ఇప్పుడు ఎన్నికలు నిర్వహించమన్న కరోనా అని సాకులు చెబుతున్నారు. మీరు కరోనా గురించి భయపడుతున్నారా లేక ఎన్నికలు నిర్వహిస్తే ఎలాగూ ప్రజలు మీకు బుద్ధి చెప్పి తీరుతారన్న విషయం మీకు ముందుగానే అర్థం అయిపోయిందా? అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదా అంటూ ఆయన వైకాపా నాయకులను ప్రశ్నించారు.
అసలు మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఏమి మాట్లాడుతున్నారో వారికైనా అర్థం అవుతుందా లేదో తెలుసుకోవాలి. అసలు ఏ మంత్రి దేని గురించి మాట్లాడుతున్నారో కూడా తెలియడం లేదు. మంత్రిత్వశాఖకు సంబంధం లేని మంత్రులు ఇతర శాఖల గురించి మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి గురించి కంటే కూడా ఎక్కువగా ప్రవీణ్ ప్రకాష్ గురించి మాట్లాడుతున్నారు. ఆయనే ఎక్కువ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
ఏకగ్రీవ ఎన్నికలు రద్దు చేయాలి..
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి. గతంలో జరిగిన ఏకపక్ష ఏకగ్రీవ ఎన్నికలు రద్దు చేయాలి.
డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. నియమాలను అతిక్రమించిన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి.
పండగలు వస్తున్నాయి..బస్సులు నడపండి..
పండగలు సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ నుంచి అమరావతికి బస్సులు నడపాలి. హైదరాబాద్ తో అందరికి సంబంధాలున్నాయి. రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నుంచి రాజధానికి బస్సులు లేకపోవడం దురదృష్టకరం. రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు చర్చించుకుని సమస్యను పరిష్కరించాలి.
కేవలం ప్రకటనలకే పరిమితం అయిన మాటలను ఆచరణలో పెట్టాలి. కేవలం పార్టీకి పేరు తెచ్చుకోవడం కోసం ప్రకటనలు ఇస్తే సరిపోదు అని పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పటికే అప్పుల్లో ఉంది. వాటిని ఎలా తగ్గించుకోవాలి అని చూడాలి కానీ పత్రికలకు ప్రకటనలు ఇచ్చి నిధులు దుర్వినియోగం చేస్తారా అని ప్రశ్నించారు. మనం చేసే పనుల వల్ల మంచి పేరు రావాలి కానీ ప్రజాధనం దుర్వినియోగం చేయడం వల్ల కాదు అని ఆయన చురకలు అంటించారు.
పోలీసులకు ఫిర్యాదు చేశా..
ప్రకాశం జిల్లా మాల్యాద్రి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఫిర్యాదు చేశా. గతంలో నాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని పోలీసులు విచారించారు. విజయసాయిరెడ్డి స్థాయికి వ్యక్తిగత దూషణలు తగవు. బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలి. విపక్షాలు పడే కష్టాల గురించి సోమవారం మాట్లాడుతా అంటూ తెలిపారు.