Raghurama Meets Amit Shah :
ఏపీ సీఎం హోదాలో జగన్ ఎప్పుడు ఢిల్లీ పర్యటనలకు వెళ్లినా.. కేంద్ర మంత్రులు, ప్రధాని నరేంద్ర మోదీలతో అపాయింట్ మెంట్ల విషయం ఎలా ఉన్నా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మాత్రం జగన్ కు అపాయింట్ మెంట్ గగనంగా మారుతున్న సంగతి తెలిసిందే. కొన్ని సార్లు అయితే జగన్ అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి.. దానిని అమిత్ షా రద్దు చేసేసిన సందర్భాలూ ఉన్నాయి. వెరసి ముందుగానే షెడ్యూల్ ఖరారు చేసుకున్న జగన్ తన ఢిల్లీ పర్యటనను సైతం వాయిదా వేసుకోక తప్పడం లేదు. అయితే అమిత్ షాతో పాటు కేంద్ర కేబినెట్ లో ఏ మంత్రి వద్దకైనా క్షణాల్లో వాలిపోతున్న నరసాపురం ఎంపీ, వైసీపీ రెబెల్ నేత రఘురామకృష్ణరాజు.. ఈ విషయంలో తాను జగన్ కంటే చాలా రెట్ల మేర సమర్ధుడినని నిరూపించుకున్నారనే చెప్పాలి.
జగన్ కు ఎందుకు దొరకట్లేదు?
మొన్నటికి మొన్న రఘురామపై ఫిర్యాదు చేసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలవాలని నిర్ణయించుకోగా… అమిత్ షా అపాయింట్ మెంట్ దొరకని నేపథ్యంలో జగన్ తన పర్యటనను ఓ రోజు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా ఢిల్లీకి వెళ్లిన జగన్.. ఎప్పుడో రాత్రి పొద్దుపోయిన తర్వాత గానీ అమిత్ షాను దర్శనం చేసుకోలేకపోయారు. ఈ సందర్బంగా అమిత్ షాతో దాదాపుగా గంటన్నరకు పైగా భేటీ అయిన జగన్.. రఘురామపై ఫిర్యాదు చేసే ఉంటారన్న వాదనలు వినిపించాయి. అయితే అప్పటికప్పుడు రఘురామపై చర్యలేమీ లేకపోవడంతో జగన్ చెప్పిన మాటలను అమిత్ షా అలా విని ఇలా వదిలేశారన్న వాదనలూ వినిపించాయి. వెరసి రఘురామపై ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో తప్పనిసరిగా వేటు వేయించే దిశగా వైసీపీ ఎంపీలు తమదైన శైలిలో వ్యూహ రచన చేశారు. ఆ మేరకే ఇప్పుడు ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు నిరసన హోరును వినిపిస్తున్నారు.
షాతో రఘురామ భేటీ
ఇదంతా బాగానే ఉన్నా.. తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులను వారి కార్యాలయాల్లోనే కలుస్తున్న రఘురామ.. మంగళవారం కూడా ఎంచక్కా అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఏఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయాన్ని పక్కనపెడితే.. ఏకంగా సీఎం హోదాతో పాటుగా పార్లమెంటులో హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఎంపీలు ఉన్న పార్టీ వైసీపీకి అధినేతగా ఉన్న జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వని అమిత్ షా.. అడగ్గానే రఘురామకు ఎలా అపాయింట్ మెంట్ ఇస్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా వైసీపీ టికెట్ పై ఎంపీగా గెలిచి అదే పార్టీకి బద్ధ విరోధిగా మారిన రఘురామ.. తనను తాను సీఎం జగన్ కంటే కూడా సమర్దుడిగా నిరూపించుకున్నారని మాత్రం చెప్పక తప్పదు.
Must Read ;- వైరల్ జోస్యం!.. జగన్, రఘురామ భవిష్యత్తు ఏంటీ?











