కాంగ్రెస్ పార్టీ అప్రకటిత సారథి రాహుల్ గాంధీ కొత్త రీతిలో కేంద్ర ప్రభుత్వానికి తన నిరసన తెలియ చెప్పాలని నిర్ణయించుకున్నారు. మరీ కొత్త పద్ధతి కాకపోయినా.. గతంలో వారి పారట్ీ ఎంపీ రేణుకాచౌదరి అనుసరించిన మార్గమే ఆయన ఇప్పుడు ఆశ్రయిస్తున్నట్టు సమాచారం. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా రైతుల్లో ఆ దిశగా ఆలోచన రేకెత్తించే చాలని భావిస్తోంది. ఆ నేపథ్యంలో ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగానూ తమ నిరసనలను ప్రకటించాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే రాహుల్.. రైతులకు మద్దతుగా, వ్యవసాయ బిల్లుకు నిరసనగా ట్రాక్టరు సవారీ చేయబోతున్నారు.
గతంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటుకు ట్రాక్టరు తనే స్వయంగా తోలుకుంటూ వచ్చి.. వార్తల్లో నిలిచారు. అప్పట్లో రైతులకు వ్యతిరేకంగా వచ్చిన బిల్లుకు ఆమె ఆ రీతిగా నిరసన తెలియజేశారు. ఇప్పుడు రాహుల్ కూడా అదే బాటను అనుసరించబోతున్నట్టు సమాచారం.
దేశవ్యాప్తంగా రైతుల వ్యతిరేకతను తెలియజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కిసాన్ ప్రొటెస్ట్ పేరుతో ఆందోళనలు చేపట్టనుంది. పంజాబ్ లోని సంగ్రూర్ నుంచి ఈ ఆందోళన ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంజాబ్ లో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనే సాగుతున్నది గనుక.. వారి నిరసనలు, ఆందోళనలకు ఎలాంటి పోలీసు పరమైన ప్రతిబంధకాలు ఉండకపోవచ్చు. అదే సమయంలో.. సంగ్రూర్ అనేది ఆ రాష్ట్రంలో ఒక వ్యవసాయోత్పత్తుల కేంద్రం లాంటి ప్రాంతం. ఈ నేపథ్యంలో అక్కడినుంచే రాహుల్ ఆందోళన చేపట్టాలని అనుకుంటున్నట్టు సమాచారం.
పంజాబ్ వ్యాప్తంగా పర్యటిస్తూ రాహుల్ అక్కడినుంచి హర్యానాలోకి ప్రవేశసిస్తారు.అక్కడినుంచి ఢిల్లీ వరకు తన యాత్ర నిర్వహిస్తారు. ఈ యాత్ర మొత్తం దశలవారీగా ట్రాక్టరు మీదే సాగుతుంది.
కార్పొరేట్లకు అనుకూలంగా ఉంటూ.. రైతులకు ద్రోహం చేసేలాగా మోడీ సర్కారు తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేసేలాగా.. కాంగ్రెస్ ఈ కార్యక్ర మానికి రూపకల్పన చేసింది. మరి ట్రాక్టర్ డ్రైవింగ్ లో రాహుల్ తన నైపుణ్యాన్ని ఏ రకంగా నిరూపించుకుంటారో చూడాలి.
మోడీ సర్కారు మీద అవకాశం వచ్చినప్పుడెల్లా ధ్వజమెత్తుతున్న రాహుల్ గాంధీ.. ‘సూట్ బూట్ కీ సర్కార్’ అంటూ బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆ నేపథ్యంలోనే ఆయన రైతులకు ప్రతీకగా నిలిచే ట్రాక్టరు సవారీచేస్తూ.. తమ పార్టీ మాత్రమే రైతులకు అనుకూలంగా ఉండగలదనే అభిప్రాయం కలిగించేలాగా.. ఈ యాత్ర నిర్వహించనున్నారు.











