ఒసేయ్ రాములమ్మ చిత్రంతో నటుడిగా, అంకుల్ చిత్రంతో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన రాజ్ మాదిరాజు దర్శకుడిగా, నటుడిగా, రచయితగా సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా హేజ్ ట్యాగ్ కృష్ణారామా పేరుతో ఆయన రూపొందించిన సినిమా ఈటీవీ విన్ ద్వారా జనం ముందుకు వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రలు పోషించారు. కృష్ణారామా అనుకుంటూ సేదతీరాల్సన వయసులో ఈ హ్యాజ్ ట్యాగ్ ఎందుకొచ్చిందన్న ఆసక్తి సినిమా చూస్తేనేగానీ మనకు తెలియదు. ఆ విశేషాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.
* అన్నీమంచి శకునములే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు బావమరిదిగా నటించేటప్పుడు ఆయనతో పంచుకున్న కథ ఇది. షూటింగ్ లో ఆయన నన్ను బావమరిది అనే పిలిచేవారు. కథ విన్నవెంటనే నటించాడానికి ఆయన అంగీకరించారు. మరో పాత్రకి గౌతమి అయితే బాగుందన్నా. నానమ్మ పాత్రను అంగీకరిస్తారా అన్న అనుమానం ఉన్నా వెళ్లి కథ చెప్పగానే ఆమె ఒప్పుకున్నారు. అనన్యశర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, రవివర్మ, జెమినీ సురేశ్ లాంటి నటులంతా కుదిరారు. ఒక్క తెలుగే కాకుండా ఇతర భాషల్లో కూడా చేయొచ్చన్న ఆలోచన వచ్చింది. ప్రస్తుతం ఈటీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు మంచి స్పందన రావడం ఆనందంగా ఉంది.
* ఈ కథకు స్ఫూర్తి గురించి చెప్పాల్సి వస్తే ఫేస్ బుక్ లో యాక్టివ్ గా ఉండే వృద్ధజంట కథ ఇది. అందులోకి వారు రావడానికి కారణం వారు అనుభవిస్తున్న ఒంటరితనమే. నాన్న తన ఆలోచలను చెబుతుంటే అమ్మ వాటిని కంపోజ్ చేస్తుంటుంది. అయితే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి కథలుంటాయి. కృష్ణవేణి, రామతీర్థ అని ఈ జంటకు పేరు పెట్టి కథ నడిపించాను.
*ఈ సినిమా తర్వాత చేయడానికి రెండు మూడు స్క్రిప్టులు ఉన్నాయి. మనకు హీరోలున్నారు కానీ షీరోలు లేరు అందుకే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలని ఉంది.
*‘బామ్మ మాట బంగారు బాట’ తర్వాత రాజేంద్రప్రసాద్, గౌతమి జంటగా నటించిన చిత్రమిదే. శనివారం రాత్రి 12 గంటలకి స్ట్రీమింగ్ ప్రారంభం కాగానే పది గంటల్లోనే రికార్డు స్థాయిలో జనం చూశారు. ఓ చిన్న సినిమాకి ఈ స్థాయిలో స్పందన రావడం ఎంతో సంతృప్తికరంగా ఉంది. సామాజిక సందేశం ఇచ్చే చిత్రమిది. వయసుతో సంబంధం లేకుండా అందరికీ కనెక్ట్ అయ్యే విషయాలుంటాయి.
ఇందులో ఓ బ్యాండ్ బృందం బుర్రకథ తరహాలో చేసే హంగామా యువతరానికి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. మొదట్ల వెబ్ సిరీస్‌గా చేద్దామానుకున్నా. చివరికి సినిమాగా మారింది. ఉద్యోగ విరమణ చేయడంతోనే జీవితం ముగిసినట్టు కాదు. నలభయ్యేళ్ల అనుభవాన్ని ఒక్క రోజులో పక్కనపెట్టేసి అది పనికి రానిదని తేల్చి పారేయడం కరెక్ట్ కాదు. వాళ్ల అనుభవాన్ని మనం ఉపయోగించుకోవచ్చు కూడా. అలా వాళ్లని బిజీ చేయడంతో వాళ్లలోని ఒంటరితనాన్ని కూడా దూరం చేయొచ్చని చెప్పే ప్రయత్నమే ఇది. దీనికి సీక్వెల్ తీసే ఆలోచన కూడా ఉంది.