అక్టోబరు 22.. ఉదయం 11 గంటలు.. 11.30 గంటలు.. అటు తారక్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే క్షణాలు.. భీమ్ కోసం రామ్ ఇచ్చే ట్రీట్ ఎలా ఉండబోతోంది? అందిరి కళ్లలోనూ అదే ఉత్కంఠ. పైగా ఇది రాజమౌళి చేసే ఇంద్రజాలం.. అందుకే దీనికి ఇంత క్రేజ్..
‘వాడు కనబడితే సముద్రాలు తడబడతాయ్.. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయ్.. వాడి పొగరు ఎగిరే జెండా.. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన ముద్దు బిడ్డ.. నా తమ్ముడు.. గోండు బెబ్బులి.. కొమరం భీమ్..’ అంటూ అల్లూరి సీతారామరాజు పాత్రధారి రామ్ చరణ్ పలికే డైలాగ్ తో కొమరం భీమ్ ను రాజమౌళి ఆవిష్కరించారు.
‘ఆర్ఆర్ఆర్’ ట్రెండెంగ్ కు ఇక తెరపడింది. ఈరోజును రాజమౌళి అసలు ఎందుకు ఎంచుకున్నాడో కూడా స్పష్టత వచ్చేసింది. భీమ్ కోసం రామరాజు రావడం ఎందుకో కూడా తెలిసిపోయింది. భీమ్ పుట్టిన రోజు ఇది. అప్పుడు రామ్ చరణ్ పుట్టిన రోజుకు సర్ ప్రైజ్ ఇచ్చిన రాజమౌళి ఈసారి ఎన్టీఆర్ పుట్టిన రోజు సర్ ప్రైజ్ ఇవ్వాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఎన్టీఆర్ పోషించిన పాత్ర కొమరం భీమ్ పుట్టిన రోజుకు ఈ సర్ ప్రైజ్ ఇస్తున్నారు. కానీ ప్రకటించిన సమయంకన్నా అరగంట ఆలస్యంగా ఈ టీజర్ విడుదలైంది.
అక్టోబరు 22 కొమరం భీమ్ పుట్టిన రోజు. గోండు వీరుడు కొమరం భీమ్ పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి ఇచ్చే ట్రీట్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. కొమరం భీమ్ పాత్రకు సంబంధించిన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు విడుదల చేశారు. టీజర్ కూడా అందరి ముందుకూ వచ్చేసింది. గడిచిన నాలుగు రోజులుగా ఎన్టీఆర్ అభిమానులు ఈ టీజర్ ఎలా ఉంటుందా అని ఆత్రుతగా ఎదురుచూశారు.
దీని కోసమే రాజమౌళి రామోజీ ఫిలింసిటీలో కొంత షూటింగ్ చేశారు. భీమ్ కోసం అల్లూరి సీతారామరాజు వచ్చే సన్నివేశాన్నిరామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరించారు. ఇది కేవలం ఎన్టీఆర్ మీద ఓ వీడియో బైట్ కట్ చేయడం కోసమే చేశారట. దీని ఎడిటింగ్ కార్యక్రమాలు చకచకా పూర్తిచేసి ఈరోజు విడుదల చేశారు. రాజమౌళి ఎవరి అంచనాలకూ అందడని మరోసారి నిరూపించుకున్నారు. డీవీవీ ఎంటటైన్ మెంట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ టీజర్ విశ్లేషణ కూడా చూద్దాం.