ఇద్దరు సూపర్ స్టార్లు ఒక సినిమాలో నటిస్తే సంచలనాలకు కొదవేముంటుంది. నట వీరవిహారానికి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోతకు అడ్డేముంటుంది. ఇంతకీ ఆ ఇద్దరు సూపర్ స్టార్లు ఎవరో ఈ పాటికి ఇట్టే అర్ధమైపోయే ఉంటుంది. ఒకరు స్టైల్ కే కొత్త నిర్వచనమిచ్చిన రజనీకాంత్ అయితే అనతికాలంలో లేడీ సూపర్ స్టార్ అనిపించుకుంటున్న నయనతార మరొకరు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు చేస్తూ ఎప్పుడూ అరడజను చిత్రాలతో బిజీగా ఉండే ఆమె తాజాగా రజనీకాంత్ తో నాలుగోసారి కలసి నటిస్తుండటం ఓ విశేషం. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం “;చంద్రముఖి” ఎంతటి ఘన విజయం సాధించిందో తెలియంది కాదు. ఆ తర్వాత జగపతిబాబు, మీనా జంటగా నటించిన “కథానాయకుడు” చిత్రంలో వీరిద్దరూ కామియో అప్పీరెన్సులో తళుక్కుమన్నారు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన “దర్బార్” చిత్రం ఈ ఏడాది సంక్రాంతి ముందు సందడి చేయడమే కాదు, కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం వేరుగా చెప్పనక్కర లేదు.
ఈ క్రమంలోనే రజనీ రాజకీయ ఎంట్రీకి ముందు చివరి చిత్రమని చెబుతున్న “అన్నాత్తా”లో కూడా నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. మొత్తం మీద రజనీతో నాలుగోసారి నటించడమే కాకుండా ఆయన చివరి చిత్రంలో కూడా నటించే అరుదైన అవకాశం కూడా నయన్ అందుకుంది. ఇక సినిమాలను అంగీకరించే విషయంలో తన మొదటి ప్రాధాన్యం ఆమె తమిళ సినిమాలకు ఇస్తోంది. లోగడ తెలుగులో పలు హిట్ సినిమాలు చేసినప్పటికీ, నాలుగైదేళ్లుగా సరాసరి ఏడాదికి ఒక తెలుగు సినిమాను కూడా ఆమె చేయడం లేదు., 2016లో “బాబు బంగారం” తర్వాత 2018లో “జై సింహా”లో నటించిన ఆమె గత ఏడాది “సైరా నరసింహారెడ్డి” చిత్రం చేసింది. ప్రస్తుతం రజనీ సరసన నటిస్తున్న “అన్నాత్తా ” చిత్రం తమిళంతో పాటు తెలుగు వంటి పలు బాషలలో రానుంది. ప్రస్తుతం తమిళంలో నాలుగైదు చిత్రాలు చేస్తూ ఆమె బిజీగా ఉంది. ఇవన్నీ వేటికవే విభిన్న చిత్రాలు, పోలికలేని పాత్రలట.
Must Read ;- రజనీ చివరి చిత్రం ఎన్నికల లోపు వస్తుందా? రాదా?