రాజశేఖర్.. టాలీవుడ్ సీనియర్ హీరో. యాంగ్రీ యంగ్ మెన్ గా పలు సూపర్ హిట్ మూవీస్ లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను అలరించారు. రాజశేఖర్ తొలి సినిమా ‘వందేమాతరం’. ‘అంకుశం’ సినిమాలో ఆయన పోషించిన పోలీసు పాత్ర నిజజీవితంలో కొంతమంది పోలీసులను కూడా ప్రభావితం చేసింది. ఆ సినిమాకు గాను రాజశేఖర్ కి మంచి పేరు వచ్చింది. ఆవేశపరుడైన యువకుని (యాంగ్రీ యంగ్ మాన్) పాత్రలకు ఆయన పెట్టింది పేరు. 90వ దశకంలో మంచి స్టార్ డం అనుభవించారు ఆయన. చిరంజీవి, బాలయ్య సినిమాలకు పోటీగా ఈయన సినిమాలు ఆడేవి. ముఖ్యంగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రాజశేఖర్ విజయవంతమైన చిత్రాలలో నటించారు.
ఆయన యాక్టర్ మాత్రమే కాదు మంచి వైద్యుడు కూడా. తన తండ్రి కోరిక మేరకు ఆయన వైద్య విద్యనభ్యసించాడు. చెన్నైలో కొంతకాలం ప్రాక్టీసు చేశాడు కూడా. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్యవృత్తిపై ఆయన ఆసక్తి కొనసాగుతూనే ఉంది. 1991లో సహనటి జీవితను వివాహం చేసుకున్నాడు. ఒకానొక దశలో ఆయన సినిమాలు సరిగా ఆడక ఆయన ఉంటున్న ఇల్లును కూడా అమ్ముకోవలసి వచ్చింది. గరుడవేగ సినిమా తర్వాత మళ్ళీ ఆయన నిలదొక్కుకోగలిగాడు. ఇప్పుడు ఆయన ఒక కొత్త మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జీవిత రాజశేఖర్ నిర్మాణ సారథ్యంలో ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. ఈ మూవీలో హీరో రాజశేఖర్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ‘షో’ మూవీతో రైటర్, డైరెక్టర్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్సమ్మ’ చిత్రానికి 4 నంది అవార్డులు, ‘విరోధి’ చిత్రానికి 2 నంది అవార్డులను అందుకున్నాయి. అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘యముడికి మొగుడు’ మూవీ ఫేమ్ రిచా పనాయ్ కథానాయికగా నటిస్తుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 7వ తేదీ ప్రారంభం కానుంది.











