ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటించడం అంటే అంతకన్నా పెద్ద విశేషం ఏముంటుంది. వారిద్దరే బిగ్ బీ అమితాబ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమాలో వీరిద్దరూ నటిస్తున్నారు. రజనీకి ఇది 170వ సినిమా. జైలర్ లాంటి హిట్ తర్వాత రజనీ మంచ దూకుడు మీద ఉన్నారు. ఈరోజు వీరిద్దరూ సెట్ లో కలవడంతో రజనీకాంత్ ఆ ఫోటోనూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘33 ఏళ్ళ తర్వాత నా మెంటార్ అమితాబ్ బచ్చన్ గారితో నటిస్తున్నాను.
టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షూటింగ్ చేస్తున్నాం. నా మనసు ఆనందంతో ఉప్పొంగుతోంది’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. వీరిద్దరూ కలిసి ఆఖరిగా నటించిన చిత్రం హమ్. ఇందులో అమితాబ్ తమ్ముడిగా రజనీ నటించారు. మరో తమ్ముడి పాత్రను గోవిందా పోషించారు. ముకుల్ ఎస్. ఆనంద్ దీనికి దర్శకత్వం వహించారు. రజనీ సూపర్ హిట్ చిత్రం బాషాకు ఈ చిత్రమే ప్రేరణ. హమ్ లో రజనీ ఇన్ స్పెక్టర్ పాత్రను పోషించారు.
హమ్ లో ఎడిటింగ్ లో తీసేసిన ఓ సన్నివేశం బాగా నచ్చడంతో దాన్ని బేస్ చేసుకుని బాషా కథను తయారు చేశారు. రజనీ బాషాకు ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టే హమ్ లోనూ అమితాబ్ కు ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అమితాబ్, రజనీ కలిసి మొట్టమొదటిసారిగా నటించిన హిందీ చిత్రం అంధాకానూన్. ఇదే సినిమా తెలుగులో చట్టానికి కళ్లులేవు పేరుతో తెరకెక్కింది. ఆ తర్వాత గిరఫ్ తార్ లోనూ అమితాబ్, రజనీ నటించారు. 1991లో హమ్ విడుదలైన తర్వాత ఇంతవరకూ అమితాబ్ తో రజనీ నటించలేదు. తాజా చిత్రం వీరిద్దరికి నాలుగో చిత్రమవుతుంది.
కేరళ రాష్ట్ర రాజధాని అయిన తిరువునంతపురంలోని అగ్రీకల్చర్ యూనివర్సిటీ క్యాంపస్‌లో ఈ మధ్యే ఈ సినిమా షెడ్యూల్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తమిళనాడులోని తిరునల్వేలిలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో జరుగుతోంది. ఇందులో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జైభీమ్ తర్వాత దర్శకుడు జ్ఞానవేల్ రాజా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మరో విశేషమేమిటంటే మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ఇందులో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. రితికా సింగ్, మంజు వారియర్, దుషారా విజయన్ లు లేడీ లీడ్ లుగా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమాని శరవేగంతో పూర్తి చేసే పనిలో దర్శకుడు ఉన్నారు. రజనీ ఓ పోలీసు పాత్రను పోషిస్తున్నట్టు సమాచారం.