పోర్న్ చిత్రాల కేసులో రాజ్ కుంద్రాకు బెయిలా? జైలా? అన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం కుంద్రా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఆయన న్యాయవాది బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కుంద్రా మెడకు ఉచ్చు బిగుసుకోవడం ఖాయంలా కనిపిస్తోంది. అతనితో పాటు ఆయన భార్య శిల్పా శెట్టి కూడా ఇందులో ఇరుక్కునే అవకాశం ఉంది. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఆయన కంపెనీలో పనిచేసే నలుగురు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వారు ఇప్పటికే పోలీసులకు తగిన సమాచారం ఇచ్చారు.
సాక్ష్యం చెప్పడానికి నలుగురు ఉద్యోగులు ముందుకొచ్చినట్టు ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులు చెప్పారు. ఈ కేసులో ఓ పక్క కొందరు బాధితులు కుంద్రాకు వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఇందులో నటించమని తమను కుంద్రా ఒత్తిడి చేసినట్టు కొందరు నటులు ఆరోపించారు. దీనికి ఇప్పుడు ఉద్యోగులు కూడా తోడయ్యారు. రాజ్ కుంద్రాకు చెందిన వియాన్ ఇండస్ట్రీస్ కంపెనీలో ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాజ్ కుంద్రాతోపాటు అతని టెక్ అసోసియేట్ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు.
కుంద్రా ఇంటిపై దాడి చేసి కొన్ని ఆధారాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శిల్ప వాంగ్మూలాన్ని కూడా పోలీసులు నమోదుచేశారు. అది పోర్న్ కంటెంట్ కాదని, ఎరోటిక్ కంటెంట్ అని శిల్ప వాదిస్తోంది. ఈ కేసు విషయంలో తాము హైకోర్టుకు వెళతామని రాజ్ కుంద్రా న్యాయవాది సుభాష్ జాధవ్ అంటున్నారు. రాజ్ కుంద్రా అరెస్టు చట్టవిరుద్ధమని, పోర్న్ వీడియో ఒక్కటి కూడా లేదని అన్నారు. 4000 పేజీట ఛార్జి షీటు దాఖలు చేసినా అందులో లైంగికంగా ఎత్తి చూపే ఆధారాలు లేదన్నది కుంద్రా న్యాయవాది ఆరోపణ.
రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా సాక్ష్యాలు బలంగా ఉండటంతో అతను ఈ కేసు నుంచి బయటపడటం కష్టమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వెబ్ సిరీస్ అవకాశాల పేరుతో ఎంతోమందిని తమ వైపు లాక్కుని వారితో బూతు చిత్రాలు తీస్తున్నాడని ఆరోపణలు కుంద్రాపై వెల్లువెత్తాయి. అనేక మంది మోడల్స్ కూడా కుంద్రాపై ఆరోపణలు గుప్పించారు. కుంద్రాకు మద్దతు ఇచ్చేవారు కరవయ్యారు.
రేపటి వరకూ కుంద్రా పోలీసు కస్టడీలోనే ఉంటారు. కొందరు నటులకు పోలీసులు సమన్లు పంపినా వారు పోలీసుల ముందుకు హాజరుకాలేదు. సెక్షన్ 67 ఏ కింద రాజ్ కుంద్రాకు బెయిల్ వస్తుందని ఆయన న్యాయవాది అంటున్నారు. ఇంతకుముందు మునావర్ ఫరూఖి కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. రాజ్ కుంద్రాకు బెయిలా? జైలా?.. ఏం జరుగుతుందో చూడాలి.
Must Read ;- తన భర్తకు ఏ పాపమూ తెలియదంటున్న శిల్ప