రాకింగ్ స్టార్ యష్ సినిమా ఖరారైంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్నచిత్రమిది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాకి ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనే టైటిల్ నిర్ణయించారు. వెంకట్ నారాయణ నిర్మాత. ఇక గీతూ మోహన్ దాస్ గురించి చెప్పాలంటే ఆమె నటి, దర్శకురాలు. ఆమె భర్త రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్. గీతూ మోహన్ దాస్ కు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. యష్ గీతూ మోహన్ దాస్ కాంబినేషన్ లో దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. సాయిపల్లవి హీరోయిన్ అనే టాక్ వినిపిస్తోంది. ఇది అధికారికంకాదు. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై మాస్టర్ మైండ్ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దాదాపు ఏడాదిన్నర పైగా యష్ ఖాళీగా ఉన్నారు. చివరికి ఈ ప్రాజెక్ట్ ఖరారు చేశారు.
ఈరోజు మూవీ టైటిల్‌ను ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అని ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు. జోకర్ పాత్రలో యష్ కనిపిస్తున్నట్లు విజువల్స్ ఉన్నాయి. వీడియోను గమనిస్తే అందులో మూవీ టైటిల్ ‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’ అనే టైటిల్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించటం విశేషం. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వెంకట్ కె.నారాయణ సినిమా విశేషాలను వివరిస్తూ ‘యష్‌తో సినిమా చేయబోతుండటం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. యష్, గీతు స్ట్రాంగ్ నెరేషన్‌తో మాస్, యాక్షన్ అంశాలను కలగలిపిన కథను తయారు చేయటానికి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ అద్భుతాన్ని ప్రపంచానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని ఆసక్తి మాక్కూడా ఉంది’ అన్నారు.
డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ మాట్లాడుతూ ‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్, మూతోన్ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్ ఇలాంటి డిఫరెంట్ నెరేషన్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయాన్ని తెలుసుకోవటానికి ఎప్పుడూ తహతహలాడుతుంటాను. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల కలయికగా కథ ఉంటుంది. యష్ ఓ అద్భుతమైన వ్యక్తి. నేను అలాంటి వ్యక్తిని చూడలేదు. అతనితో కలిసి ఈ మ్యాజికల్ జర్నీని చేయడంకన్నా ఆనందం ఏముంటుంది’ అన్నారు.
రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమా గురించి వివరిస్తూ టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్’సినిమాకు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 10, 2025న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.