రామ్ హీరోగా ఆ మధ్య వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మాస్ ఆడియన్స్ ను అలరించే విషయంలో, ఈ సినిమా ఆయనను మరోమెట్టు పైకి ఎక్కించింది. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించింది. లుక్ పరంగా .. తెలంగాణ యాసతో కూడిన డైలాగ్స్ పరంగా రామ్ చేసిన ప్రయోగం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించింది. చాలాకాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరి జగన్నాథ్ కి, ఉత్సాహమనే ఊపిరి ఊదిన సినిమా ఇది.
అలాంటి ఈ సినిమా తరువాత రామ్ మళ్లీ మాస్ లుక్ తో కూడిన పాత్రను చేస్తాడా? లేదంటే డీసెంట్ లుక్ తో కూడిన క్యారెక్టర్ ను ట్రై చేస్తాడా? అనేది అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో అటు మాస్ ఆడియన్స్ ను .. ఇటు యూత్ ను అలరించేలా రామ్ ‘రెడ్’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సాఫ్ట్ లుక్ తో సిద్ధార్థ్ గాను .. రఫ్ లుక్ తో ఆదిత్యగాను ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఆయన మేనరిజమ్స్ .. బాడీలాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా వుండనున్నాయి. తొలిసారిగా రామ్ చేసిన ద్విపాత్రాభినయం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తమిళంలో క్రితం ఏడాది ప్రథమార్థంలో వచ్చిన ‘తడమ్’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘రెడ్’ను తెరకెక్కించారు. స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. గతంలో కిషోర్ తిరుమల, రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘నేను శైలజ’ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాకి మాత్రం ఆ స్థాయి విజయం లభించలేదు. తాజాగా వీరి కాంబినేషన్లో రూపొందిన ‘రెడ్’ సినిమాపై మాత్రం భారీ అంచనాలే వున్నాయి.
భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో రామ్ సరసన నాయికగా మాళవిక శర్మ అలరించనుండగా, అమృత నాయర్ .. నివేదా పేతురాజ్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. హెబ్బా పటేల్ ఒక మాస్ మసాలా సాంగ్ లో మెరవనుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మ్యూజికల్ హిట్ గా నిలబెట్టి, ఆ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించిన మణిశర్మ, ‘రెడ్’ సినిమాకి కూడా సంగీతాన్ని అందించాడు. ‘డించక్ .. ‘ అంటూ సాగే ఐటమ్ సాంగ్, ‘నువ్వే నువ్వే .. ‘ అంటూ సాగే మెలోడీ సాంగ్ ఇప్పటికే యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాయి.
రామ్ పోషించిన రెండు వైవిధ్యభరితమైన పాత్రలు .. తెరపై తనని రఫ్ గాను .. సాఫ్ట్ గాను చూడాలకుంటున్న అభిమానులను సంతృప్తి పరచడం కోసం ఆయన చేసిన ప్రయత్నం .. ఈ రెండు విభిన్నమైన పాత్రలను కిషోర్ తిరుమల ఆవిష్కరించిన తీరు .. మణిశర్మ అందించిన బాణీలు .. అభిమానుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపిస్తూ ఉండటంతో, ఆ రోజు కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో రామ్ కి మరో హిట్ పడటం ఖాయమనే ఉత్సాహంతో వాళ్లంతా వున్నారు.