తిరుమల లడ్డూ వివాదం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతు నూనెలు కలవడం కారణంగా ఇతర దేవస్థానాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తిరుమల లడ్డూల తయారి కోసం జంతువుల కొవ్వుతో కలిసిన నెయ్యి వాడడం చాలా పాపం అని రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు జరిగిన పరిశీలనలో చేప నూనె, కొవ్వు తిరుమల లడ్డూల తయారీలో కలిపినట్లు తేలిందని అన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తీయడానికి అంతర్జాతీయంగా ఈ కుట్ర జరిగిందా, లేక దేశంలోనే దీనికి బీజం పడిందా అనే విషయంపై ప్రభుత్వం దర్యాప్తు చేయించాలని ఆయన కోరారు. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, ఇంకోసారి మరెవ్వరు కూడా ఆటలు ఆడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
తిరుమల లడ్డూల తయారిలో గత వైసీపీ ప్రభుత్వంలో జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆరోపణలు రావడంతో దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రామజన్మ భూమిలో నిర్మించిన మందిరం ప్రారంభం సందర్భంగా తిరుమల నుంచి లక్ష లడ్డూలు అక్కడికి ఎగుమతి చేశారు. అప్పుడు జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉండగా.. అప్పుడు కూడా అదే చేప నూనె, జంతు కొవ్వులు కలిసిన లడ్డూలు వెళ్లాయి.
వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇంతటి అపచారం జరిగినట్లుగా గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ రిపోర్టులు విడుదల చేసింది. ఈ విషయంపై గత జగన్ ప్రభుత్వం పై దేశ, విదేశాల్లోని శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూల తయారీకి నెయ్యి సరఫరా చేసిన వారిపైన అప్పటి టీటీడీ బోర్డు కమిటీపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తిరుమల శ్రీవారి భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, మోదీ, అమిత్ షా కూడా ఈ విషయంపై సీరియస్ అవుతున్నట్లు చెబుతున్నారు. చూడబోతే ఈ వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డికి మరిన్ని చిక్కులు ఎదురవుతాయని అంటున్నారు.