ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. ఈ ఏడాది ‘రెడ్’ మూవీతో మిశ్రమ ఫలితం అందుకున్నాడు. ఇప్పుడు తమిళ టాలెంటెడ్ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో బైలింగ్విల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా నిర్మాణం జరుపుకోనుంది. ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతోంది.
ఇక ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్టేడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందట. రామ్ ఇంతకు ముందు ఫ్యాక్షన్ కథాంశంతో సినిమాలు చేయలేదు. అందుకే ఈ సినిమా అతడికి ప్రత్యేకం కానుంది.
నిజానికి లింగుసామి గతంలో రూపొందించిన ‘పందెం కోడి, పందెంకోడి 2’ సినిమాలు ఫ్యాక్షన్ తరహా కథలతోనే రూపొందాయి. అలాంటి సినిమాల్ని డీల్ చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. అందుకే ఇప్పుడు రామ్ తో చేయబోయే సినిమాకి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్నాడని తెలుస్తోంది. తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలు వచ్చి.. చాలా కాలం అయిపోయింది. అందుకే ఇప్పుడు రామ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మళ్ళీ ఫ్యాక్షన్ అనుభూతిని ఇవ్వబోతున్నారు. మరి ఫ్యాక్షనిస్ట్ గా రామ్ ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతాడో చూడాలి.