యూత్ ఫుల్ స్టోరీలను తెరకెక్కించడంలో దర్శకుడు కిషోర్ తిరుమలకి మంచి అనుభవం ఉంది. యూత్ పల్స్ ను బట్టి ఆయన కథలను అల్లుకుంటూ ఉంటాడు. రామ్ తో ఆయన రూపొందించిన ‘నేను శైలజ‘ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. దాంతో ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత ఇద్దరూ కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’ చేశారు. ఈ సినిమా ఓహో అనిపించలేదు .. అలాగని చెప్పేసి అబ్బే అనిపించనూ లేదు. మళ్లీ కొంత గ్యాప్ తరువాత రామ్ – కిషోర్ తిరుమల కలిసి ‘రెడ్’ సినిమా చేశారు. రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి కిషోర్ తిరుమల మాట్లాడాడు.
సాధారణంగా నా సినిమాకి నేనే కథ .. సంభాషణలు రాసుకుంటాను. కానీ ‘రెడ్’ సినిమా మూల కథను తమిళ మూవీ ‘తడం’ నుంచి తీసుకోవడం జరిగింది. ఆ ఐడియా నాకు వస్తే ఎలా చేస్తానో అలాగే కొత్త కథగా భావించే ఈ సినిమా చేశాను. గతంలో రామ్ కి లవర్ బాయ్ ఇమేజ్ ఉండేది. ‘ఇస్మార్ట్ శంకర్‘ నుంచి మాస్ హీరోగా కూడా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఈ రెండు ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకుని రెండు పాత్రలను బ్యాలెన్స్ చేయడం జరిగింది. కథలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను చివరి వరకూ కూర్చోబెడతాయి. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఒక విందుభోజనం చేసిన సంతృప్తిని పొందుతారు. ఆ స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది” అని స్పష్టం చేశాడు.
“ఈ సినిమా టైటిల్ దగ్గర నుంచి ప్రతి అంశం కథతో లింకై ఉంటుంది. అందువలన మేము ఏ విషయాన్ని రివీల్ చేయలేదు. తెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు పొందే అనుభూతి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టైటిల్ చూస్తే ‘రెడ్’ .. విడుదలయ్యేది ‘సంక్రాంతి’కి .. ఇది పండుగ సమయంలో చూడదగిన సినిమానేనా? అనే సందేహం అవసరం లేదు. ఇది యూత్ .. మాస్ .. ఫ్యామిలీ ఆడియన్స్ చూడదగిన సినిమా అని కచ్చితంగా చెప్పగలను. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు కూడా ఇదే మాట చెబుతారు. గతంలో రామ్ తో నేను చేసిన ‘నేను శైలజ’ మాదిరిగానే, మా కాంబినేషన్లో వచ్చిన మరో మంచి చిత్రం అవుతుంది. సంక్రాంతికి ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయడం ఖాయం” అని కిషోర్ తిరుమల చెప్పుకొచ్చాడు.
Mst Read ;- దర్శకులకు మంచి డిన్నర్ ఇచ్చిన హీరో రామ్