అందాల తార రాశీఖన్నా ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో ఛాన్స్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంది. ఇప్పటికే ఒక హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే ను ఫైనల్ చేశాడట దర్శకుడు హను. మరో హీరోయిన్ కోసం అనేక మంది పేర్లను పరిశీలించిన దర్శకుడు చివరికి రాశీఖన్నా ను ఓకే చేసినట్లు తెలుస్తోంది. నిజానికి మొదట ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా రష్మిక ఫైనల్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
ఇప్పటికే దర్శకుడు రాశీఖన్నాకు కథ వినిపించాడని, అందులో తన పాత్రకు సంబంధించిన ఎలిమెంట్స్ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ సినిమాలోని రాశి పాత్ర కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందట. అతిత్వరలోనే సినిమా విశేషాలను మీడియా ముఖంగా చిత్ర బృందం తెలియజేస్తారని సమాచారం. ఇక కథ విషయానికి వస్తే హీరో దుల్కర్ సల్మాన్ ఒక ఆర్మీ ఆఫీసర్ గా కనపడనున్నాడని, అలాగే కథ మొత్తం 1960వ దశకం నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది.
ఇందులో మంచి ఫీల్ ఉన్న లవ్ స్టొరీ కూడా ఉంటుందని వినికిడి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి నెలలో షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనున్నదని సమాచారం. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో తెరకెక్కించనున్నాడు దర్శకుడు . ఇప్పటికే రాశీఖన్నా తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సరసన ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలిసిందే.