మదర్ టంగ్ కన్నడలో వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ తో బోలెడంత క్రేజ్ తెచ్చేసుకుని అక్కడ తిరుగులేని కథానాయిక అయిపోయింది రష్మికా మండణ్ణ. అది సరిపోలేదన్నట్టు.. అమ్మడు టాలీవుడ్ లోనూ తన గోల్డెన్ లెగ్ మోపింది. మొదటి సినిమా ‘ఛలో’ తో హిట్టు కొట్టింది. తదుపరి సినిమా ‘గీతగోవిందం’తో బ్లాక్ బస్టర్ సాధించేసింది. ఈ రెండు సినిమాలతోనూ రష్మికా మందణ్ణ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. దేవదాస్ , డియర్ కామ్రేడ్ సినిమాలు పరాజయం పాలైనా.. రష్మికా ఇమేజ్ కు ఏమాత్రం డ్యామేజ్ కలగలేదు సరికదా … వరుసగా స్టార్ హీరోల సరసన నటించే సువర్ణావకాశం దక్కించుకుంది.
ఈ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ బ్లాక్ బస్టర్ తో బోణి కొట్టింది. అంతలోనే భీష్మ రూపంలో మరో సక్సెస్ అందుకుంది. ఈ రెండు సినిమాల విజయాలతో .. గీతా బేబ్.. టాలీవుడ్ లో అగ్ర పథాన దూసుకుపోతోంది. అంతేకాదండోయ్…. ఇప్పుడు వరుసగా బడా ప్రాజెక్ట్స్ లో పెద్ద హీరోల సరసన వరుసగా నటించేందుకు సిద్ధమవుతోంది. ఆల్రెడీ అల్లు అర్జున్, సుకుమార్ ‘పుష్ప’ లో కథానాయికగా ఫిక్స్ అయిపోయిన రష్మికా .. యన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలోని రెండో సినిమాలోనూ హీరోయిన్ గా ఎంపికయినట్టు వార్తలొస్తున్నాయి.
అంతేకాదు.. రీసెంట్ గా రష్మికా మందణ్ణ .. యంగ్ హీరో అఖిల్ ఐదో సినిమా లోనూ కథానాయికగా ఎంపికయిందని సమాచారం. సురేంద్రరెడ్డి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఇటీవలే అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో అఖిల్ స్పైగా నటించబోతున్నాడని అంటున్నారు. అలాంటి స్టైలిష్ పాత్రలో నటించబోతున్న అఖిల్ తో రష్మికా రొమాన్స్ కు రెడీ అవుతుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇక రష్మికా మండణ్ణ కోలీవుడ్ లో కూడా కథానాయికగా రంగ ప్రవేశం చేయబోతోంది. ఏకంగా కార్తిలాంటి లీడింగ్ హీరో తో రొమాన్స్ కు రెడీ అవుతోంది. సినిమా పేరు సుల్తాన్. భాగ్యరాజ్ కణ్ణణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది విడుదల కు సిద్ధమవుతోన్న ఈ సినిమాలో ఇంకా.. యోగిబాబు, పొణ్ణంబళం ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. పొటన్షియల్ స్టూడియోస్ బ్యానర్ పై యస్.ఆర్.ప్రభు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
వీటితో పాటు రష్మికా మండణ్ణ.. కన్నడలో ధృవ సర్జా హీరోగా నటిస్తోన్న పొగరు సినిమాలో కూడా కథానాయికగా నటిస్తోంది. మొత్తానికి మన తెలుగు తెర గీత.. మూడు భాషల్లోనూ వరుస సినిమాలు లైన్ లో పెట్టుకొని తనకి తిరుగే లేదని నిరూపిస్తోంది. మరి ఈ సినిమాలతో రష్మికా ఇమేజ్ ఇంక ఏస్థాయిలో పెరుగుతుందో చూడాలి.