తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో రవితేజ సందడి మామూలుగా లేదు. తన బాడీ లాంగ్వేజ్ కి తన కథ .. తన ఎనర్జీకి తగిన పాత్ర పడితే చెలరేగిపోవడం ఖాయమని ఆయన మరోసారి నిరూపించాడు. మాస్ మహారాజు పనైపోయిందని అనుకున్న వాళ్లకు ఈ సినిమా హిట్ తో సమాధానం చెప్పాడు. ఈ నెల 9వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలిరోజు నుంచే తన దూకుడు మొదలుపెట్టింది. అయితే ‘రెడ్’ .. ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు ఆ దూకుడుకు కళ్లెం వేస్తాయేమోననే మాటలు వినిపించాయి. ఆ రెండు సినిమాలు కూడా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో, ‘క్రాక్’ జోరు కంటిన్యూ కావడం ఖాయమనేది తేలిపోయింది.
‘రాజా ది గ్రేట్’ తరువాత రవితేజకు సరైన హిట్ పడలేదు. ఎప్పటిలానే కథలను ఎంచుకుంటున్నాడు .. సెట్స్ పైకి వెళుతున్నాడు .. థియేటర్లకు వస్తున్నాడు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సందడి లేకుండా పోతోంది. దాంతో ఆయన అభిమానులు చాలా నిరాశకు లోనయ్యారు. వరుస ఫ్లాపులతో ఆయన సక్సెస్ రేట్ తగ్గిందేమోగానీ, ఆయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గలేదు. ఎక్కడో .. ఏదో ట్రాక్ తప్పుతుందని భావించిన రవితేజ, ఈ సారి ఆ లోటుపాట్లను సరిచేసుకుంటూ గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చాడు. అలా ‘క్రాక్’ సినిమా థియేటర్లకి వచ్చింది.
ఈ సినిమా పోస్టర్లు .. టీజర్లు .. ట్రైలర్లు చూసినవారికి, ఇందులో మాస్ కంటెంట్ మరో లెవెల్లో ఉందనే విషయం అర్థమైపోయింది. ఇక ఆకతాయి పోలీస్ ఆఫీసర్ గా .. ఆటకట్టించే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ ఎలా రెచ్చిపోతాడనే విషయం ఆడియన్స్ కి బాగా తెలుసు. అందువలన కరోనా స్ట్రెయిన్ అనే టెన్షన్ ను మాస్కుల మాటున దాచేసి, అందరూ థియేటర్ల బాటపట్టారు. ఈ కారణంగానే ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తన కెరియర్లోనే పెద్ద హిట్ కొట్టేసిన రవితేజ, మాస్ మహారాజుకు ఇప్పట్లో తిరుగులేదని నిరూపించాడు.











