రాయలసీమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో వేగంగా అడుగులు వేస్తోంది. రానున్న రెండేళ్లలో రూ.8,022 కోట్లతో రోడ్లు, తాగునీరు, జలసంరక్షణ, వ్యవసాయం, పారిశుద్ధ్యం వంటి కీలక రంగాల్లో అభివృద్ధి పనులను చేపడుతోంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13 వేలకు పైగా గ్రామాల్లో ఏకకాలంలో గ్రామసభలు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
రోడ్ల నిర్మాణం, పరిశుభ్రత కోసం ప్రభుత్వం ఏకంగా రూ.4,523 కోట్లు కేటాయించగా, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పుడిచర్లలో పంట కుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం ద్వారా 29 వేలకు పైగా ఫామ్ పాండ్స్ మంజూరు చేయడంతో 50 వేల ఎకరాలకు పైగా కొత్తగా సాగులోకి వచ్చి రైతులకు అదనంగా రూ.55 కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఆగిపోయిన పులివెందుల మల్టీ విలేజ్ వాటర్ స్కీమ్ పనులను రూ.280 కోట్లతో మళ్లీ పట్టాలకెక్కించారు.
ఇక, రాయలసీమలోని సరిహద్దు జిల్లాల ప్రజలను వణికిస్తున్న అడవి ఏనుగుల సమస్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. చిత్తూరు, అన్నమయ్య తదితర సరిహద్దు జిల్లాల్లో అడవి ఏనుగుల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కర్ణాటక నుంచి ప్రత్యేకంగా కుంకీ ఏనుగులను రప్పించారు. పలమనేరు నియోజకవర్గం పరిధిలోని ముసలమడుగులో ఈ కుంకీ ఏనుగుల కోసం అత్యాధునిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఇక్కడికి చేరిన కుంకీ ఏనుగులు, మావట్ల సహాయంతో అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగులను అటవీలోకి మళ్లిస్తూ.. ప్రజలకు ప్రాణభయం లేకుండా విజయవంతంగా అదుపులోకి తెస్తున్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ, పల్లెపండుగ లాంటి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు వేగంగా మారుతున్నాయి. ఏనుగుల దాడి నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూనే, మరోవైపు రాయలసీమను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యలు స్థానికంగా ఎంతో ఊరటనిస్తున్నాయి.











