పులివెందుల పులి, సీమ సింహం అంటూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎలివేషన్లు వేస్తుంటారు ఆయన అభిమానులు. అక్రమ ఆస్తుల కేసులో సీబీఐ కోర్టు ముందు హాజరు కావడానికి హైదరాబాద్ వచ్చిన సమయంలో.. జగన్‌తో పాటు పులివెందుల పులులు.. సీమ సింహాల జాడ ఎక్కడా కనిపించలేదు. రాయలసీమ అంటే వైఎస్ ఫ్యామిలీ అడ్డా.. జగన్‌రెడ్డి ఖిల్లా.. వైసీపీకి పెట్టని కోట అని చెప్పుకొంటారు గానీ.. జగన్ హైదరాబాద్ టూర్‌లో రాయలసీమ యూత్ ఆచూకీనే లేదు. తెలంగాణలోని ఖమ్మం, కోస్తాంధ్రలోని ప్రకాశం జిల్లాల నుంచి జనాన్ని తోలుకొచ్చారని వార్తలోచ్చాయి. కర్నూలు, కడప నుంచి జనాలు దిగినట్టు కనిపించలేదు.
రాయలసీమలో జగన్ కోటకు బీటలు పడటం కాదు.. ఏకంగా బద్దలైపోయిందని 2024 ఎన్నికలు రుజువు చేశాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ అసలు బోణీ కొట్టలేదు. కడపలో ముక్కీ మూలిగా 3 సీట్లలో గెలిస్తే.. ఉమ్మడి కర్నూలు, చిత్తూరు జిల్లాలో తలో రెండు ఎమ్మెల్యేలు వచ్చాయి. సీమలో వైసీపీ సీన్ ఏ రేంజ్‌లో సితార్ అయిందో.. ఈ లెక్కలే క్లియర్‌గా చెబుతున్నాయి. మూడు రాజధానుల పేరుతో జగన్ అడిన మూడు ముక్కలాట..రాయలసీమలో వైసీపీని ఘోరంగా దెబ్బతీసిందని కొన్ని విశ్లేషణలు వివరిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ జిల్లాల్లో కానీ.. కుదరకపోతే ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ప్రకాశం జిల్లాలో అయినా రాజధాని రావాలని ఎక్కువ మంది కోరుకున్నారు. కానీ జగన్ త్రీ క్యాపిటల్స్ స్లోగన్ సీమ ప్రజలకు పెద్ద షాక్ ఇచ్చింది.
రాజధాని సెంటిమెంట్ సంగతి పక్కన పెట్టినా.. వైసీపీ హయాంలో రాయలసీమలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించలేదు. సాగు నీటి ప్రాజెక్టుల పనులు అంగుళం కూడా ముందుకు కదల్లేదు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడం జగన్ పాలనలో నిర్లక్ష్యానికి పరాకాష్ట. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో అనంతపురంలో కియా మోటార్స్, చిత్తూరు జిల్లాలో ఫాక్స్‌కాన్, హీరో మోటార్స్ కంపెనీల ద్వారా వేల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి. గండిపేట ప్రాజెక్టు పూర్తి చేసి పులివెందులకు నీళ్లిచ్చిన ఘనతా చంద్రబాబు ఖాతాలోనే ఉంది. జగన్‌ను ఓన్ చేసుకొని తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తే.. ఆయన వల్ల సీమకు ఒరిగిందేమీ లేదని అక్కడ ప్రజలు గట్టిగా ఫిక్సయ్యారు.
ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు.. సీమ ప్రాంతంలోని వైసీపీ నాయకులూ జగన్‌పై ఆగ్రహంతో ఉన్నారట. జగన్ హయాంలో పనులు చేసిన వైసీపీ నేతలకు ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదు. వైసీపీ ఓటమి తర్వాత ఆ బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి. వాటి సంగతి తేల్చండి అని జగన్‌కు మొర పెట్టుకున్నా.. ఆ ఒక్కటి అడగొద్దు అని ఆయన ఫేస్ టర్నింగ్ ఇచ్చుకొంటున్నారని మీడియాలో వచ్చిన వార్తలు చూసే ఉంటారు. మొత్తం మీద కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలన్నట్లు.. సీమ సింహాలు.. జగన్‌రెడ్డిని సింగిల్ సింహంలా వదిలేయడానికి ఇన్ని కారణాలున్నాయి.











