RBI Pulls Out Rs 2000 Crore Loan From AP Government Under Overdraft
ఏపీ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పులు రూ.6 లక్షల కోట్లకు చేరిపోయాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏపీ సర్కారు రూ.2.5 లక్షల కోట్లను అప్పుగా తీసుకుంటే.. జగన్ తన రెండున్నరేళ్ల పాలనలోనే ఈ మార్కును దాటేసి ఏపీని ఆర్థిక సంక్షోభంలో పడేశారన్నది అందరూ చెబుతున్న మాట. ప్రభుత్వాలన్నాక అప్పులు సహజమే అయినా.. ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేయడమంటే ఆలోచించాల్సిన విషయమే. అప్పులే పరమావధిగా సాగుతున్న జగన్ పాలన తీరు కారణంగా ఏపీ ఆర్థిక పరిస్థితి దివాలా తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వాదనలూ లేకపోలేదు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏపీ ప్రభుత్వం దివాలా తీయడం ఖాయమేనని సీనియర్ రాజకీయవేత్త, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవలే సంచలన వ్యాఖ్యలు చేయడం, వాటిని జనసేనాని పవన్ కల్యాణ్ గుర్తు చేస్తూ ఏపీ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. జగన్ సర్కారు తీరుపై వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు నిజమయ్యే సూచనలు చాలా స్పష్టంగానే కనిపిస్తున్నాయన్న వాదనలు ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. కొత్తగా తీసుకుంటున్న అప్పులు.. పాత బాకీలకు జమ అయిపోతున్న తీరు ఆ పరిస్థితిని నిదర్శనం అని చెప్పక తప్పదు.
Must Read ;- బాబు ‘బిల్డింగ్’లనూ తనఖా పెట్టేస్తారా?
ఇలా వచ్చి అలా వెళ్లి..
తాజాగా మంగళవారం నాడు జగన్ సర్కారు ఆర్బీఐ వేలంలో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది. ఇందులో రూ.1,000 కోట్లను 20 ఏళ్ల కాల వ్యవధికి 7.14 శాతం వడ్డీ రేటుతో తీసుకోగా.. మరో రూ.1,000 కోట్లను 15 ఏళ్ల కాల వ్యవధికి 7.13 శాతం వడ్డీకి తీసుకుంది. ఈ మొత్తం రూ.2 వేట కోట్లకు సంబంధించి వడ్డీ చెల్లింపులు వచ్చే నెల (నవంబర్) నుంచే మొదలు కానున్నాయి. ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ల పేరు చెప్పుకుని జగన్ సర్కారు సేకరించిన ఈ రుణం నిధులు ఇలా వచ్చి ఏపీ ఖజానాలో పడిపోయాయో లేదో.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటిని లాగేసింది. ఏపీ సర్కారు ఓవర్ డ్రాఫ్ట్ కింద సేకరించిన నిధులకు గానూ ఆర్బీఐ ఈ నిధులను లాగేసిందన్న మాట. అంటే.. జగన్ సర్కారు ఏ కారణం చేత అయితే ఈ నిధులను సేకరించిందో ఆ పనికి ఈ నిధులు ఉపయోగపడలేదన్న మాట. అసలు ఆ నిధులు ఒక రోజో, రెండు రోజులో ఏపీ ఖజానాలో ఉంటే కదా. వాటిని వినియోగించుకునేందుకు అవకాశం చిక్కేది. రుణంగా తీసుకున్న రూ.2 వేల కోట్లు ఇలా వచ్చి ఏపీ ఖాతాల్లో పడ్డాయో, లేదో అలా ఆర్బీఐ జమ చేసుకుంది. అంటే.. ఈ రుణం నిధులు ఏపీ ప్రభుత్వానికి అక్కరకు రాకపోయినా.. ఆ నిధులకు సంబంధించిన వడ్డీ చెల్లింపులను మాత్రం వచ్చే నెల నుంచి చెల్లించడం మొదలు పెట్టక తప్పదన్న మాట. మరీ విడమరచి చెప్పాలంటే.. అక్కరకు రాని అప్పునకు కూడా ఏపీ ప్రభుత్వం వడ్డీ చెల్లించక తప్పదన్న మాట. అయితే మంగళవారమే కేంద్రం నుంచి ఆర్థిక లోటు భర్తీ నిధుల కింద రూ.1,438 కోట్లను విడుదల చేసింది కాబట్టి సరిపోయింది గానీ.. ఈ నిధులు రాకుంటే పండగ పూట ఉద్యోగులను పస్తులు పెట్టేయాల్సి వచ్చేది.
ఇదే తొలిసారేమీ కాదు
ఇలా అప్పుగా.. అది కూడా వడ్డీకి తీసుకున్న రుణం నిధులు ఏపీ ప్రభుత్వానికి అందకుండా.. పాత బకాయిల కింద జమ అయిన తీరు మంగళవారం నాటి ఘటనే తొలిది కాదు. గతంలోనూ ఇదే రీతిన ఏపీ ప్రభుత్వం రుణం తీసుకుంటే.. ఆ నిధులను కూడా ఆర్బీఐ ఓవర్ డ్రాఫ్ట్ నిధుల కింద లాగేసుకుంది. ఇలా ఇప్పటికే నాలుగైదు సార్లు జరిగినట్లుగా తెలుస్తోంది. ఓవర్ డ్రాఫ్ట్ కు వెళ్లిన ఏ రాష్ట్రానికైనా ఇదే తరహా పరిస్థితి ఎదురు కాక తప్పదు. అందుకే కాబోలు.. దేశంలోని ఏ రాష్ట్రం కూడా ఓవర్ డ్రాఫ్ట్ అంటేనే వెనక్కు తగ్గుతాయి. చంద్రబాబు హయాంలో ఏపీ ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ అన్న మాటే లేకుండా నెట్టుకు వచ్చింది. అయితే ఇప్పుడు నవరత్నాల పేరిట భారీ ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న జగన్ సర్కారు.. అప్పుల మీద అప్పులు చేస్తోంది. కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఆర్‌బీఎం గానీ, ఓవర్ డ్రాప్ట్ అన్న మాటలను గానీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఫలితంగానే భారీ వడ్డీకి తీసుకుంటున్న రుణాల నిధులు కూడా పాత అప్పులకు జమ అయిపోతున్నాయి. ఇదే తరహాలో మరిన్ని అప్పులకు జగన్ సర్కారు యత్నించడం ఖాయంగానే కనిపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులోనూ కొత్త రుణాల నిధులు పాత బకాయిలకు జమ అయిపోవడం ఖాయమేనని చెప్పాలి.
Must Read ;- రాజన్న రాజ్యం కాదు దోపిడీ రాజ్యం