నటకీరిటి రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘ఆ..నలుగురు’ సినిమాలో ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. ‘నేనే గెలిచాను…కాదు కాదు మీరే గెలిపించారు’ అనే డైలాగ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కు నూటికి నూరు శాతం సరిపోతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలలో 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంత భారీ స్కోరు సాధించడంలో పంజాబ్ కెప్టెన్ రాహుల్ సూపర్ ఇన్నింగ్స్ కారణం. రాహుల్ కేవలం 69 బాల్స్ లో 132 పరుగులు సాధించి నాటౌట్ గా నిలిచారు. ఇందులో 14 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. 16 ఓవర్లు ముగిసేసరికి 132 పరుగుల వద్ద ఉన్న స్కోరును 20 ఓవర్లలో 206 పరుగులకు చేర్చాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్ ఎలా సాగిందో ఊహించుకోవచ్చు.
కోహ్లీ తప్పిదాలు
రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్ లను కోహ్లీ మిస్ చేయడం గమనార్హం. బెస్ట్ ఫీల్డర్ గా పేరు ఉన్న కోహ్లీ నుంచి ఈ తప్పిదాలను మనం ఊహించలేము. 83 పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన క్యాచ్ ను కోహ్లీ వదిలివేసినప్పుడు పంజాబ్ స్కోరు కేవలం 146 పరుగులు. మరో ఆరు పరుగుల వద్ద రాహుల్ ఇచ్చిన ఈజీ క్యాచ్ ను మరోమారు కోహ్లీ చేజేర్చాడు. ‘క్యాచెస్ విన్ మ్యాచేస్’ అని క్రీడా వర్గాలలో ఓ ప్రాథమిక సూత్రం ఉంది. కోహ్లీ లాంటి అత్యుత్తమ ఫీల్డర్ క్యాచ్ లను మిస్ చేయడంతో బెంగళూరు జట్టు భారీ మూల్యాన్ని చెల్లించుకొంది. కోహ్లీ ఇచ్చిన జీవనదానంతో గేర్ మార్చిన రాహుల్ సిక్సర్లు, ఫోర్లుతో మోత మోగించాడు.
60 బాల్స్ లో 90 పరుగులు చేసిన రాహుల్ ఆ తరువాత 9 బాల్స్ లోనే 42 పరుగులు చేయడం విశేషం. మొత్తం మీద పంజాబ్ విజయంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడని చెప్పకతప్పదు. భారీ స్కోరు కళ్ళముందు ఉండటంతో బ్యాటింగ్ కు దిగకముందే బెంగళూరు జట్టు ఓటమికి ఫిక్స్ అయినట్లుంది. ఒక్కరంటే ఒక్కరూ కూడా క్రీజులో ఎక్కువసేపు నిలవలేకపోయారు. వాషింగ్టన్ సుందర్ చేసిన 30 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. రాహుల్ కు రెండు జీవనదానాలు ఇచ్చిన కోహ్లీ బ్యాటింగ్ లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. టైమింగ్ కోసం ట్రై చేసిన కోహ్లీ హుక్ షాట్ ఆడబోయి ఔటయ్యాడు. డీవిలియర్స్, ఫించ్ కూడా ఓ మాదిరి స్కోరుకే వెనుదిరగడంతో బెంగళూరు 109 పరుగులకే ఆలౌట్ అయింది.
ఆడుకుంటున్న నెటిజన్స్
హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లోనూ, పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లోనూ కోహ్లీ తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రాహుల్ ఇచ్చిన రెండు క్యాచ్ లను కూడా కోహ్లీ వదిలివేశాడు. దీంతో నెటిజన్స్ కోహ్లీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. రాహుల్ ప్రత్యర్థి జట్టనే సంగతిని కోహ్లీ మరిచిపోయాడని కొందరూ కామెంట్ చేయగా మరికొందరు మాత్రం రాహుల్ అంటే కోహ్లీకి అంత ఇష్టమా? అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.











