సినిమాల్లో హీరో ఇంట్రడక్షన్ సీన్ చూసి ఈలలు వేయని అభిమానులు ఉండరు. దర్శకుడు కూడా ఆ హీరో ఇంట్రడక్షన్ కోసం ఎంతో శ్రద్ద పెట్టి పనిచేస్తాడు. ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. ఆ సమస్య వచ్చేది సోనూ సూద్ నుంచి. ఓ సినిమాలో పెద్ద స్టార్ హీరో ఉండి అదే సినిమాలో విలన్ గా సోనూ ఉంటే ఈలలు ఎవరికి వేస్తారు? తెర మీద సోనూ విలన్ గా కనిపించగానే ఈలలు వేస్తే ఆ హీరో పరిస్థితి ఏమిటి? ఇది ఇప్పుడు దర్శకుల ముందున్న ప్రశ్న. ఎందుకంటే సోనూపై అభిమానం జనంలో వెల్లువెత్తుతోంది.
సిసలైన అభిమానం అంటే ఇదేనేమో అనిపిస్తోంది. ఒకప్పుడు మహానటుడు ఎన్టీఆర్ దర్శనం కోసం వచ్చే అభిమానుల మాదిరిగా సోనూ ఇంటికి అభిమానులు క్యూకడుతున్నారు. ఆ అభిమానం ఎక్కడిదాకా వెళుతోంది అంటే ఆయన కాళ్ల మీద పడి మొక్కేదాకా. ఇలాంటిది ఒకప్పుడు ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. పైగా ఇది గుండెల్లోనుంచి తన్నుకొచ్చిన అభిమానం.
సోనూ కాళ్లపై పడిన మహిళ
సోనూ కాళ్లపై పడి ఓ మహిళ మొక్కింది అంటే ఆ అభిమానం ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఆమె ఆయనను ఓ సోదరుడిలా భావించి రాఖీ కట్టి కాళ్లకు మొక్కడం విశేషం. సోనూ వారించినా వినకుండా ఆమె సోనూ కాళ్లకు మొక్కింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ప్రతి రోజూ అతడి ఇంటికి వచ్చే అభిమానులు ఎక్కువైపోతున్నారు. సోనూ గేటు బయటికి వచ్చి వారందరి కష్టసుఖాలు తెలుసుకోవడం, వారికి తగిన హామీలు ఇవ్వడం నిత్యకృత్యంగా మారింది.
ఈ కరోనా కాలంలో అతని పూర్తి సమయాన్ని కోవిడ్ బాధితుల కోసమే వెచ్చిస్తున్నారు. ఓ పక్క సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ ఎవరికి ఎలాంటి అవసరమొచ్చినా చర్యలు తీసుకుంటున్నారు. మరో పక్క తన నివాసానికి వచ్చే ప్రజలను కలుసుకుంటున్నారు. ఈ విషయంలో సోనూలోని ఓర్పును అందరూ ప్రశంసిస్తున్నారు. అందరికీ సోనూ విషయంలో ఆశ్చర్యం కలిగించే విషయం ఒక వ్యక్తి పెద్ద వ్యవస్థలా పనిచేయడం. ఇదే సినిమాల్లో విలన్ వేషాలు వేసే అతన్ని రియల్ హీరోని చేశాయి.
Must Read ;- సోనూసూద్ తో పాన్ ఇండియా సినిమా .. ఆ దర్శకుడెవరు?











