‘జీవితను ఓడించాలి’ ఇది ఒకరి జీవితాశయం. ‘జీవిత సత్యాలేవో తెలుసుకోలేక పోవడం’ ఇది ఇంకొకరికి గుణపాఠం. ఈ రెండింటి ఫలితమే నటి జీవితా రాజశేఖర్ ఓటమి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరఫున ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసిన జీవిత కేవలం ఏడంటే ఏడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆమె మీద పోటీ చేసిన నటుడు రఘుబాబు నోట్లో నుంచి మాట రాలేదు కానీ ఆయనకు ఓట్లు మాత్రం రాలాయి. నోరు పారేసుకుంటే ఓట్లు రాలతాయనే భ్రమను వీడాలనేది ఓ జీవిత సత్యం.. ‘జీవిత’లాంటివారు నేర్చుకోవాల్సిన సత్యం కూడా.
ఇక్కడ చెప్పుకోవాల్సిన పెద్ద కామెడీ ఏంటంటే ప్రకాష్ రాజ్ ప్యానల్లో ఉన్న జీవిత 7 ఓట్ల తేడాతో ఓడిపోవడం. మరి మెగా అండదండలు ఏమయ్యాయి? సినిమా పరిశ్రమలో ఇప్పుడు జరిగింది మెగా ఓటమి. మరి దీనికి కారకులు ఎవరు? మెగాస్టార్ చిరంజీవి ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇచ్చినప్పుడు తమ కుటుంబంలో ఉన్న సినిమా సభ్యులందరితోనూ ఓటు వేయించాలి. కానీ మెగా కుటుంబంలో దాదాపు 11 మంది నటులు ఉన్నా కేవలం మూడు ఓట్లు మాత్రమే పడ్డాయి. వరుణ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, నిహారిక, కళ్యాణ్ దేవ్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ల ఓట్లు కూడా పడి ఉంటే జీవిత ఓటమి జరిగేది కాదు కదా.
పోనీ సాయిధరమ్ తేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఓటు వేయడానికి ఎందుకు రాలేదు? పోల్ మేనేజ్ మెంట్ లోనూ ప్రకాష్ రాజ్ ప్యానల్ దారుణంగా ఫెయిలయ్యింది. ఏడు ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు రఘుబాబుకు పడాల్సిన నాలుగంటే నాలుగు ఓట్లను సంపాదించుకోగలిగా సామర్థ్యం ఉన్నా జీవిత ఓటమి పాలయ్యేవారు కాదు. ఇంట్లో ఉన్న వారినే ఓటు వేయడానికి రప్పించలేకపోవడం మెగా ఓటమికి ప్రధాన కారణం.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు.. వీరు మాత్రమే ఓటు వేయడానికి వచ్చారు. అక్టోబరు 10న ఎన్నికలు జరగబోతున్నట్లు ఎప్పట్నుంచో ఊదరగొడుతున్నారు. ఓటు సమయానికి దూరంగా ఉన్నారు. ఈ జీవిత సత్యాలను తెలుసుకోలేకపోవడం వల్లే దారుణ ఓటమి పాలయ్యారు. తరచూ మీడియా ముందుకు రావడం మీద చూపించే శ్రద్ధ ఓట్లు అడగడంలో జీవిత చూపించి ఉన్నా ఓటమిని తప్పించుకునేవారు. ఈ జీవిత సత్యాన్ని పక్కన పెట్టి ఇంకొకరి జీవితాశయంలోకి వద్దాం.
నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ జీవితాశయం జీవితను ఓడించడమేనట. బావ కళ్లలో ఆనందాన్ని చూడాలని మొద్దు శీను అన్నట్లుగా ఉందీ డైలాగ్. రఘుబాబు గెలిచిన వెంటనే బండ్ల ఎగిరి గంతేశారు. రఘుబాబుకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పేశారు. ఆమె మీద వ్యక్తిగతంగా ఉన్న కోపం బండ్ల గణేశ్ కు తీరినట్లయింది. ‘మాలో జీవిత లాంటి వ్యక్తి ఉండకూడదని భావించా. అందుకే ఆమె ఓటమికి నా వంతు ప్రయత్నం చేశా. జీవితను ఓడించి ‘మా’ సభ్యులు మంచి నిర్ణయం తీసుకున్నారు’ అంటూ ఫలితాల అనంతరం బండ్ల గణేశ్ కామెంట్ చేశారు. ఇదండీ సంగతి.. అందుకే జీవిత ఓటమి పాలయ్యారు. ఎవరి ఓటమికి అయినా వెనక కారణాలు అనేకం ఉంటాయి.
Must Read ;- నాగబాబు, ప్రకాష్ రాజ్ .. క్విట్ ‘మా’ ఉద్యమం











