ఏపీ పునర్నిర్మాణంలో భాగస్వామ్యమయ్యేందుకు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ ప్రణాళిక ప్రకటించింది. రాష్ట్రంలో సుమారు రూ. 1 లక్ష కోట్ల భారీ పెట్టుబడితో కంప్రెస్డ్ బయో గ్యాస్ – CBG ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఆయన ఈ మెగా ప్రాజెక్ట్‌ను వెల్లడించారు.
ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరికొత్త మలుపు తీసుకోనుంది. ఈ భారీ పెట్టుబడి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఈ ప్లాంట్ల నిర్వహణ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ.60,000 కోట్ల భారీ ఆదాయం సమకూరనుందని అనంత్ అంబానీ స్పష్టం చేశారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతు సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ రెండూ సాధ్యమవుతాయని రిలయన్స్ తెలిపింది. వ్యవసాయ వ్యర్థాలు, పంట వ్యర్థాల నుంచి బయో గ్యాస్ తయారు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గడమే కాకుండా, వ్యర్థాలను విక్రయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. దేశ ఆహార భద్రతను కాపాడే మన అన్నదాతలు ఇపుడు బయో ఎనర్జీ తయారీ ద్వారా దేశ ఇంధన భద్రతను బలపరిచే ఇంధన దాతలుగా మారబోతున్నారని ఆకాంక్షించారు.
ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్నాయి. జియో కనెక్షన్లు, అధునాతన AI సాంకేతికత ద్వారా గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి, డిజిటల్ అగ్రి-ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే బాధ్యతను కూడా రిలయన్స్ చేపడుతోంది. సీఎం చంద్రబాబు నాయుడి విజనరీ నాయకత్వంలో ఏపీలో పారిశ్రామిక, గ్రామీణాభివృద్ధి వేగవంతం కావడానికి రిలయన్స్ బయో గ్యాస్ ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్‌గా మారనుందని పారిశ్రామిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి.











