సినిమా నటులు అంటే అంతో ఇంతో కాదు ఎంతో క్రేజ్ ఉండేది. వెండి తెరమీద వెలిగిపోయే తారలు జనం ముందుకు వస్తే ఆ క్రేజే వేరు. జనం వారిని ఆరాధ్య దైవాలుగా ఆరాధించారు. పాలకులుగా పట్టంగట్టారు. అలాంటి నటుల ప్రభ నేడు వెలవెలబోతోందా? సినిమా తారలు వీధి రౌడీల మాదిరిగా మీడియా ముఖంగా వాదులాడుకోవడం ఏ సంస్కృతికి చిహ్నం? లాంటి ప్రశ్నలు జనం నుంచి ఉత్పన్నమవుతున్నాయి. కేవలం 900 ఓట్లున్న ఓ నటీనటుల సంఘానికి సంబంధించిన ఈ ఎన్నికతో నిజానికి జానానికి ఏంటి సంబంధం?.. ఈ ప్రశ్నలన్నీ జనం మదిలో మెదిలేవే.
తారలకు జనంలో అంత క్రేజ్ ఉన్నపుడు వారిలో ఎంత హుందాతనం ఉండాలి? కానీ అదే ఇప్పుడు లోపించింది. మీడియా ముఖంగా ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకున్న వారు మళ్లీ ఒకరికొకరు తారసపడగానే ఆలింగనం చేసుకోవడాలు.. ఇది దేనికి సంకేతం? చూసే జనం వెర్రి పువ్వులు అనుకోవాలేమో. జనంలో నవ్వుల పాలవుతున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పోయిందని విమర్శిస్తున్నవారు ఎక్కువయ్యారు. మా ఎన్నికలు అనేవి పూర్తి వినోదభరిత సినిమాలా తయారైంది.
ఈ ఎన్నికల్లో పోటీ చేయడంవల్ల జనంలో ఫ్రీ పబ్లిసిటీ లభిస్తుందనుకుంటున్నారా? దాదాపు రెండు నెలలుగా మా ఎన్నికల గురించి ఊదరగొడుతున్నారు. ఎన్నికల రోజు రానేవచ్చింది. నిన్న రాత్రి కూడా ఒకరి మీద ఒకరు ఆరోపించుకుంటూ వీడియో బైట్లు విడుదల చేశారు. ఆ మాటలు విన్న వారికి వీరి మధ్య ఇన్ని విభేదాలు ఉన్నాయా అన్న భావన కలుగుతోంది. పవన్ కళ్యాణ్ పై మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలుగానీ, మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలుగానీ పరిశీలిస్తే వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందేమో అనేలా వాతావరణం తయారైంది.
కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఓటు వేయడానికి రావడం, పవన్ కళ్యాణ్ భుజంపై మోహన్ బాబు చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడటం చూస్తే ఆశ్చర్యపోవడం జనం వంతైంది. మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన మద్దతు ఎవరికి ఉంటుందన్న దాని మీద స్పష్టత ఇవ్వకుండా మాట్లాడారు. బాలయ్యబాబు మాటలు కూడా అలాగే ఉన్నాయి. అంతరాత్మ ప్రబోధం మేరకే తాము ఓటేసినట్టు చెప్పారు. పెద్ద హీరోలు కొందరు ఓటింగుకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నట్టు అర్థమవుతోంది. మధ్యాహ్నం తర్వాత అక్కినేని నాగార్జున వచ్చి ఓటు వేశారు. జూనియర్ ఎన్టీఆర్ గానీ, మహేష్ బాబు గానీ, వెంకటేష్ గానీ ఓటు వేయడానికి రాలేదు.
వీరు కావాలనే ఓటింగుకు దూరంగా ఉన్నారన్న భావన కలిగింది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క బాలకృష్ణ మాత్రమే ఓటింగుకు రావడం ఆశ్చర్యం కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు వచ్చి ఓటేసి వెళితే కొంత కళ వచ్చి ఉండేది. ఓటు విలువను తెలియజెప్పినట్టు ఉండేది. ఈ వినోదభరితమైన మా ఎన్నికలనే సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఏదైనా ఉంది అంటే అది ఓ వ్యక్తి చేసిన రిగ్గింగ్ ప్రయత్నమే. మధ్యాహ్నం 2 గంటలకు క్లైమాక్స్ చూస్తే తప్ప ఈ ఎన్నికలపై ఓ నిర్ణయానికి రాలేం. ఫలితాలు వచ్చాక మాత్రమే ఈ ఉత్కంఠకు శుభం కార్డు పడుతుంది.











