తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రేవంత్ రెడ్డిలో స్పష్టమైన మార్పే కనిపిస్తోంది. సాధారణంగానే దూకుడు తత్వంతో సాగే నేతగా పేరున్న రేవంత్.. టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన తర్వాత తన స్పీడును మరింతగా పెంచారనే చెప్పాలి. ఈ స్పీడేతో తెలంగాణలోనే అనుకుంటే మనం పొరబడినట్టే. తెలంగాణ సరిహద్దులు దాటేస్తున్న రేవంత్.. తన సత్తా ఏమిటో చూపే దిశగా సాగుతున్నారు. టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ ఈ ఈ నెల 7న పదవీ ప్రమాణం చేయనున్నారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వేదికగా జరిగే ఈ వేడుకకు గ్రాండ్ ఓల్డ్ పార్టీకి చెందిన హేమాహేమీలను ఆహ్వానించే కార్యక్రమానికి రేవంత్ శ్రీకారం చుట్టారు. ఈ క్ర మంలో సోమవారం ఆయన కర్ణాటక రాజధాని బెంగళూరు వెళ్లారు. అక్కడి పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో పాటు రాజ్యసభలో పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గే, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యలతో భేటీ అయిన రేవంత్ తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని వారిని ఆహ్వానించారు.
అనుబంధ విభాగాల్లో జోష్
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎన్నికైన మరుక్షణమే తెలంగాణలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. అప్పటిదాకా రేవంత్ ను వ్యతిరేకించిన వారంతా ఇప్పుడు అధిష్ఠానం మాటతో ఆయనకు సహకరించక తప్పని పరిస్థితి నెలకొంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక్కతాటిపైకి చేరుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. సీనియర్లలోని అసంతృప్తిని ఇప్పటికే తగ్గించేసిన రేవంత్.. పార్టీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలను బలోపేతం చేసుకునే దిశగా చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయా విభాగాల్లో జోష్ కనిపిస్తోంది.
సోనియా, రాహుల్ లకూ ఆహ్వానాలు
తన పదవీ ప్రమాణ స్వీకారానికి రావాలంటూ ఇప్పటికే రేవంత్ రెడ్డి పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు పార్టీ యువనేత రాహుల్ గాంధీలకు ఆహ్వానాలు పంపారు. ఈ మేరకు ఆయన వారిద్దరికీ లేఖలు రాశారు. ఈ నెల 7న పదవీ ప్రమాణం చేపట్టేందుకు ముహూర్తం నిర్ణయించుకున్న, రేవంత్.. ఈ కార్యక్రమంతోనే అధికార పార్టీని భయపెట్టాలన్న కసితో కదులుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రాలకు చెందిన నేతలను కూడా ఆహ్వానిస్తూ రేవంత్ తనదైన దూకుడును ప్రదర్శిస్తున్నారు.
గాంధీ భవన్ కు వాస్తు దోషమట
ఇదిలా ఉంటే… కేసీఆర్ మాదిరే రేవంత్ కు కూడా వాస్తు అంశాలపై బాగానే పట్టింపు ఉన్నట్టుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతున్న గాంధీ భవన్ వాస్తు బాగా లేదని తేల్చేసిన రేవంత్.. ఆ వాస్తు దోషాలను సరిచేసే దిశగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట. ప్రస్తుతం ఉన్న గేట్లలో ఓ దానిని మూసేసి కొత్తగా మరో చోట రెండో గేటును ఏర్పాటు చేస్తారట. అంతేకాకుండా వాస్తుకు విరుద్ధంగా ఉన్న స్టోర్ రూం, సెక్యూరిటీ రూంలను మరో చోటుకు తరలిస్తారట. రేవంత్ ఆదేశాలతో ఈ వాస్తు దోషాలను సరిచేసే పనులు ఇదివరకే ప్రారంభం కాగా… మంగళవారం సాయంత్రంలోగా ఈ పనులు పూర్తి కానున్నట్లుగా సమాచారం.
Must Read ;- రేవంత్ డేరింగ్.. నీళ్లపై నిప్పులెందుకంటే?











