కీసర తాసీల్దార్ వ్యవహారం రెండు రోజులుగా రేవంత్ మెడకు చుట్టుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స్ దొరికాయి గనుక.. ఆయనకు కూడా ఈ అక్రమాల్లో, అవినీతి ఆర్జనల్లో భాగం ఉందనేది ప్రత్యర్థుల ఆరోపణ. అయితే ఈ విషయంలో రేవంత్ మాత్రం చాలా ఘాటుగా స్పందించారు. ఈ యావత్ అవినీతి బాగోతంలో తనకు ఏ కొంత పాత్ర ఉన్నట్లు తేల్చినా సరే.. ఎలాంటి శిక్షకైనా సిద్ధపడుతానంటూ.. రేవంత్ తొడకొట్టి సవాలు విసిరారు.
రాజకీయంగా రేవంత్ పై ఫోకస్ పెడుతున్న కొందరు వ్యక్తులు.. లెటర్ హెడ్స్ దొరగ్గానే.. తెరవెనుక ఆయన పాత్ర ఉన్నట్టుగా రంగు పూయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఆరోపణలపై రేవంత్ తీవ్రంగా స్పందించారు.
కీసర తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం అని ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని రేవంత్ ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్‌హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు.
తన లెటర్‌హెడ్స్ లభించడంపై తప్పేముందన్న రేవంత్‌రెడ్డి.. అందులో ఉన్న సమాచారానికి, కీసర వ్యవహారానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. జరిగిన వ్యవహారంలో ఒక్క పైసా సంబంధమున్నా శిక్షకు సిద్ధమని తెలిపారు.