Revanth Reddy Comments On Kishan Reddy Promotion :
ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ ను మొన్న పూర్తిగా పునర్వవస్థీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అప్పటికే తన కేబినెట్ లోని ఏడుగురు సహాయ మంత్రులకు కేబినెట్ మంత్రులుగా ప్రమోషన్ కూడా దక్కింది. ప్రమోటీల్లో తెలుగు నేలకు చెందిన జి.కిషన్ రెడ్డి పేరు పతాక శీర్షికలకు ఎక్కింది. ఎందుకంటే.. తొలి సారి ఎంపీగా ఎన్నికైన కిషన్ రెడ్డి ఫస్ట్ టైమ్ లోనే మంత్రి పదవి దక్కడం, రెండేళ్లు తిరక్కుంగానే ఏకంగా కేబినెట్ హోదా దక్కడం నిజంగానే ఆశ్చర్యమేనని చెప్పాలి. తెలుగు నేలకు చెందిన నేతలకు మంత్రి పదవులు దక్కకున్నా.. కిషన్ రెడ్డికి దక్కిన ప్రమోషన్ తో తెలుగు ప్రజలు కొంతో కొంతైనా సాంత్వన పొందారనే చెప్పాలి. అయినా కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కడానికి కారణమేమిటన్న విషయాన్ని ప్రస్తావించిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ దిశగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ను ఢీకొట్టేందుకు కిషన్ కు ప్రమోషన్?
ఇటీవలే టీపీసీసీ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడిన సందర్భంగా కిషన్ రెడ్దికి దక్కిన ప్రమోషన్ ను ప్రస్తావించారు. ఈ దిశగా ఆయన ఏమన్నారంటే.. “నా రూపంలో తెలంగాణ కాంగ్రెస్ కు బలమైన అధ్యక్షుడు ఉన్నాడు. నన్ను ఎదుర్కోవాలంటే తెలంగాణ బీజేపీ అగ్ర నాయకత్వం కూడా బలంగా ఉండాలని కేంద్రం పెద్దలు భావించారు. అందుకే కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా ఇచ్చారు” అని రేవంత్ తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వైపు నుంచి చూస్తే ఈ మాట ఒకింత యాక్సెప్టబుల్ గానే ఉన్నా.. కిషన్ రెడ్డికి ఏమాత్రం ప్రతిభ లేకుండానే కేబినెట్ దక్కుతుందా? అన్న కోణంలోనూ రేవంత్ పై సెటైర్లు పడుతున్నాయి.
కిషన్ రెడ్డి సత్తా ఏ లెక్కలోకి?
టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఎంపికతో తెలంగాణ రాజకీయాల్లో అయితే ఓ రసవత్తరమైన పోటీ నెలకొందని చెప్పక తప్పదు. ఇటు అధికార టీఆర్ఎస్ తో పాటు విపక్ష బీజేపీ కూడా రేవంత్ ను చూసి భయపడుతున్న తీరు స్పష్టంగానే కనిపిస్తోంది. అంతామాత్రాన కిషన్ రెడ్డికి రేవంత్ వల్లే ప్రమోషన్ దక్కిందని చెప్పడం కాస్త అతి అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. తనకు దక్కిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పదవిలో కిషన్ రెడ్డి ఎలాంటి ఆరోపణలకు తావు లేకుండా.. సమర్ధవతంగానే తన విధులు నిర్వర్తించారు. కిషన్ రెడ్డి పనితీరు ఆ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు ప్రధాని మోదీని కూడా ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. ఈ కారణంగానే కిషన్ రెడ్డికి ప్రమోషన్ దక్కితే.. రేవంత్ రెడ్డి దానిని తన ఖాతాలో వేసుకునే యత్నం చేయడం విడ్డూరంగానే ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా రాజకీయాల్లో ఈ తరహా కామెంట్లన్నీ సర్వసాధారణమేనన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- రేవంత్ స్టైల్.. కాంగ్రెస్‌కు టానిక్ ప్లాన్!











