ఉమ్మడి ఏపీలోనూ, రెండుగా విడిపోయిన తర్వాత పాదయాత్రలతో ప్రజలతో మమేకమై అధికారాన్ని చేపట్టిన ఉదంతాలు చాలా ఉన్నాయి. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ అప్పట్లో చైతన్య రథంతో రాష్ట్రం మొత్తాన్ని చుట్టివచ్చి తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. వైస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్ మోహన్‌రెడ్డిలు కూడ పాదయాత్రలతో ప్రజలను ఆకట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి కూడ పాదయాత్ర సూత్రంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఇచ్చినందుకు ఒక్క ఛాన్స్ ఇవ్వండంటూ..
తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనని,తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటూ పాదయాత్రలో రేవంత్ తెలంగాణ వాసులను కోరనున్నట్లు తెలుస్తోంది. జులై 7వ తేదీన రేవంత్‌రెడ్డి అధికారికంగా పీసీసీ చీఫ్ పగ్గాలు చేపడతారు. ఆ తర్వాత ఆయన పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రాకపోయినా జూలై సెకండ్ వీక్ నుంచే పాదయాత్ర మొదలై దాదాపు ఏడాది పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
అసంతృప్తులను బుజ్జగిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ..
రేవంత్‌కు పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడంపై పలువురు కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు గాంధీభవన్ మెట్లు ఎక్కబోనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్లో వ్యతిరేకత చూపిన జగ్గారెడ్డి లాంటి వారు మాత్రం ఇప్పుడు మౌనంగానే ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికే రేవంత్‌రెడ్డి ఆలోచిస్తున్నారు. అసంతృప్తి నేతలతో సమావేశమవుతూ, కాంగ్రెస్ శ్రేణులతో మంతనాలు జరుపుతూ అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయా జిల్లాల్లోని కాంగ్రెస్ నాయకులందరూ కలసికట్టుగా కృషి చేసేందుకు, ప్రజల ప్రధాన సమస్యలపై పాదయాత్రలో రేవంత్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
పది ఉమ్మడి జిల్లాల్లో..
జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి ఆదిలాబాద్ జిల్లా వరకు చేయనున్నట్టు సమాచారం. దాదాపు 12 నెలలపాటు కొనసాగే ఈ సుదీర్ఘ పాదయాత్రలో పాత 10 జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గాన్ని రేవంత్‌రెడ్డి టచ్ చేసి స్థానిక సమస్యలను తెలుసుకుంటారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా పాదయాత్ర చేపడతారన్న వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయనకంటే ముందుగానే రంగంలోకి దిగాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరో పది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.
Must Read ;- వైరల్ పిక్!.. రేవంత్‌తో సూరీడు!