ఏపీలో చంద్రబాబు అరెస్టు కావడంపై రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. చంద్రబాబు జైలుకు వెళ్లడం కరెక్టా కాదా అనేది తాను మాట్లాడబోనని, కానీ, ఆయన అరెస్టు అనేది తనకు పర్సనల్ గా బాధగా అనిపించిందని అన్నారు. చంద్రబాబు అరెస్టును ఏపీ కాంగ్రెస్ పార్టీ విభాగం ఖండించినప్పటికీ ఈ విషయాన్ని తాము లాభనష్టాలతో చూడబోమని అన్నారు. అట్లాగే బీఆర్ఎస్ పెద్దలు చంద్రబాబు అరెస్టు విషయంలో స్పందించిన తీరు మీద కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారని.. హైదరాబాద్లో ఆందోళన చేయవద్దని బెదిరించారని గుర్తు చేశారు. ఆంధ్రావాళ్లను సెటిలర్స్ అంటూ వేరుచేసే ప్రయత్నం చేశారని అన్నారు. కేటీఆర్ మాటలు వారికి నష్టం కలిగించడం ఖాయమని అన్నారు. ఓ ప్రముఖ టీవీ ఛానెల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.
నేను జగన్ లాంటి వ్యక్తిని కాను – రేవంత్
అంతేకాకుండా, ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ పైన కక్ష్య తీర్చుకునే అవకాశం ఉందా అని ఆ ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ.. ‘‘లేదు.. అస్సలు లేదు.. చాలా మంది నా విధానాన్ని చూసి కేసీఆర్ పై నేను కక్ష్య తీర్చుకుంటాననే అనుకుంటారు. కానీ అది కానేకాదు. వ్యక్తిగత కక్ష్యలు, పగలు, కోపాలు తీర్చుకోవడానికి ప్రజలు మనకి అధికారం ఇవ్వడం లేదు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకాలు పెట్టుకుని మనల్ని గద్దె ఎక్కిస్తారు. ఒక వ్యక్తి ఏదో అలా చేశాడని (ఏపీలో జగన్ను ఉద్దేశించి) నేను కూడా అలా చేస్తానని అనుకోవడం అస్సలు తప్పు. నేను చేయనంటే చేయను’’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కక్ష్యా రాజకీయాలు తార స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు ఇంకొద్ది నెలలు ఉన్న ఈ సమయంలో ఇన్నేళ్లలో ఏవరూ ప్రవర్తించనట్లుగా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారు. విపక్షనేత చంద్రబాబును ఎలాగైనా జైలులో పెట్టాలనే లక్ష్యంతో ఏపీ సీఐడీ ద్వారా వివిధ కేసులు మోపి అరెస్టు చేయించారు. అంతటితో ఆగకుండా, ముందు జాగ్రత్తగా మరిన్ని కేసులు మోపి, ఒకవేళ బెయిల్ వచ్చినా మరో కేసులో అరెస్టు చేసేలా వ్యూహాలు వేశారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత చంద్రబాబును నెల రోజుల బెయిల్ రావడంతో ఇప్పుడు కాస్త రాజకీయ హడావుడి తగ్గింది. ఏపీలో జరిగిన ఈ కక్ష్యా రాజకీయ పరిణామాలను దేశమంతా ఆసక్తిగా గమనించింది.