ఎన్నడూ లేనంతగా అధికార పార్టీ… ప్రతిపక్షం విసిరిన సవాల్ ను స్వీకరించడం, దానిని నిలబెట్టుకునే ప్రయత్నం చేయడమేంటనే అంశం జనాల్లొ హాట్ టాపిక్ గా మారింది. ఇళ్ల నిర్మాణాలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క చేసిన సవాళ్ ను మంత్రి తలసాని స్వీకరించి నగరంలో నిర్మించిన డబుల్ ఇళ్లను చూపించి, కాంగ్రెస్ పార్టీకి తలసాని కౌంటర్ ఇచ్చేప్రయత్నం చేశారు. ఇంత వరకు ఓకే. కానీ మిగతా రాజకీయ నాయకులు చేసిన విమర్శలు, సవాళ్ల సంగతేంటని అధికారపార్టీ గురించి జనం చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ వర్కంగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి…కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులకు ఏదోక అంశంపై సవాళ్లను విసురుతూనే ఉంటారు. భట్టి సవాళ్ ను స్వీకరించిన ప్రభుత్వం మరీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేవంత్ రెడ్డి సవాళ్లను ప్రభుత్వం ఎందుకు స్వీకరించే ప్రయత్నం చేయడంలేదని చర్చ జరగుతోంది. ప్రభుత్వం తరుపు నుంచి ఎవరో ఒకరు తన సవాళ్లపైన ముందుకు వచ్చే ప్రయత్నం ఎందుకు చేయడంలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎప్పుడూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే, అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిత్యం ఆయన టిఆర్ఎస్ పై సవాళ్లు చేస్తూనే ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో బహిరంగ ఛాలెంజ్ లను కూడా విసిరారు. కానీ ప్రభుత్వంలోని పెద్దలు ఎప్పుడూ స్పందించలేదు. కేవలం భట్టి విషయంలో మాత్రమే ప్రభుత్వం ఛాలెంజ్ ను స్వీకరించింది. కానీ రేవంత్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడంలేదనే వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
వారికి ప్రాధాన్యమిచ్చుడెందుకనా?
ప్రభుత్వం నిర్ణయాలపై ఎప్పుడూ ప్రశ్నిస్తూ, అధికారపార్టీ నాయకుల తీరుపై రేవంత్ తన దైన శైలీలే విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయాల్లో ఆయన దూకుడు ప్రదర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుంటారు. భట్టి విక్రమార్క ఛాలెంజ్ ను స్పందించినట్లుగానే రేవంత్ ఛాలెంజ్ లకు కూడా స్పందించి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తే జనానికి అర్ధమవుతుంది ఎవరు..ఎలాంటి వారనేది. కానీ భట్టికి ఇచ్చిన ప్రాముఖ్యత ఇక్కడ రేవంత్ రెడ్డికి టిఆర్ఎస్ పార్టీ ఇవ్వదల్చుకోలేదు. అనవసరంగా తన ఛాలెంజ్లను స్వీకరించి రేవంత్ మైలేజ్ లను మనమే పెంచినవారు అవుతామని అధికార పార్టీ అనుకుంటుందేమో కాబోలు.
అలాగే బిజిపి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈమధ్యనే పార్టీ పగ్గాలు చేపట్టారు. పార్టీ పగ్గాలు అందుకున్నప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తను కూడా ప్రభుత్వ విధానాలపై వరుసగా విమర్శలు చేస్తునే ఉన్నారు. తాజాగా తెలంగాణ విమోచన దినం విషయంలో ప్రభుత్వంపై ఘాటుగానే స్పందించారు. మరీ భట్టి విషయంలో మాదిరిగానే రేవంత్ రెడ్డి, బండి సబంజయ్ ఛాలెంజ్ లకు ప్రభుత్వం స్పందించి వాస్తవమేమిటో చూపించే ప్రయత్నం ఎందుకు చేయడంలేదనే ప్రశ్న రాజకీయవర్గాల్లో తలెత్తుతుంది. అంటే వారు చేసే విమర్శల్లో వాస్తవం ఉండడం వల్లనే ప్రభుత్వం స్పందించట్లేదని దీనిని అర్ధం చేసుకోవలసి ఉంటుందా?. లేదంటే వీళ్ల ఛాలెంజ్ లకు స్పందిస్తే అనవసరంగా వారికి అధిక ప్రాధ్యాన్యం ఇచ్చినట్లని టిఆర్ఎస్ ఏమైనా భావిస్తుందా? ఏది ఏమైనప్పటికీ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు సర్వసాధారణమైన అంశంగా చూడాల్సి ఉంటుంది. నిజనిజాలను బయట పెడితే ఎవరి పక్షాన నిలబడాలో జనమే నిర్ణయించుకుంటారు.