బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసులో నటి రియాను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసు విచారణ సమయంలో డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగారు. పోలీసులు విచారణ స్టార్ట్ చేయకముందే ఆమె తన ఫోన్ డేటాను డిలీట్ చేసింది. కానీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధునాతన టెక్నలాజితో డేటాను రిట్రీవ్ చేశారు. ఆమె పలువురు డ్రగ్ డీలర్లతో ఛాటింగ్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత ఆమెను గత మూడు రోజులుగా ఎన్సీబీ అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో తనకు డ్రగ్స్ అలవాటు లేదని పేర్కొన్న రియా సిగరెట్ తాగే అలవాటు ఉందని చెప్పారు. సుశాంత్ కోసమే డ్రగ్స్ డీలర్లతో మాట్లాడానని ఆమె వెల్లడించారు. ‘కేదారనాద్’ సినిమా సమయంలో తన స్నేహితులతో కలిసి సుశాంత్ డ్రగ్స్ వాడినట్లు ఎన్సీబీ అధికారులకు ఆమె తెలిపారు.
ఇవాళ కూడా మరోమారు రియాను విచారించిన ఎన్సీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ కు సంబంధించి పోలీసులు కేసు షీట్ తయారు చేస్తున్నారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేస్తారని తెలుస్తోంది. రియాకు వైద్య పరీక్షలు చేసిన అనంతరం అరెస్ట్ పై అధికారులు ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే రియా తమ్ముడు షోవిక్, సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్ శామ్యూల్ మిరిండాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో రియాపై సీబీఐ, ఈడీ కేసులు కూడా విచారణ జరుగుతున్నాయి.
తన కుమారుడి అకౌంట్ నుంచి భారీగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు సుశాంత్ తండ్రి కేకే సింగ్ చేసిన ఫిర్యాదుతో రియాపై ఈడీ కేసు నమోదు చేసింది. డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించిన ఈడీ అధికారులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. మరోవైపు సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసుతో సంబందం ఉన్న ప్రతి ఒక్కరినీ సీబీఐ విచారిస్తోంది. ఈ కేసు విచారణను త్వరగతిన పూర్తి చేసి సుప్రీంకి సీబీఐ నివేదిక అందచేయనుంది.