‘రామాయణంలో హనుమంతుడు రావణాసురుడితో ‘రావణా,నీ పుణ్యాలన్నీఇప్పుడు నీ పాపాలతో నిరర్థకమయ్యాయి. ఇక నిన్నుఏ పుణ్యమూ కాపాడలేదు’ అని చెబుతాడు.ఏపీ సీఎం వైఎస్ జగన్‌రెడ్డికి కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఆయన లేదా ఆయన తల్లిదండ్రులు చేసిన పుణ్య ఫలమో తెలియదు గానీ జగన్‌రెడ్డికి అపూర్వ అవకాశం లభించింది. కాని..’
– జగన్మోహన్రెడ్డి రెండేళ్ల పాలనపై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇవీ.
ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్నసందర్భంగా వైసీపీ అభిమానులు,జగన్ అభిమానులు ట్విట్టర్లో హోరెత్తిస్తున్నారు.అదే సమయంలో జగన్ వైఫల్యాలపైనా సోషల్ మీడియాలో చర్చ కూడా నడుస్తోంది.ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్ కొత్త పలుకుతో సంచలన విమర్శలతో జగన్‌ను ఏకేశారు. కూల్చివేతలతో పాలన మొదలు పెట్టి వేధింపుల వరకు కొనసాగిస్తున్నారని తన కామెంట్లో పేర్కొన్నారు.అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్న కొందరిని ఉద్దేశించి నీలి మూక పేరుతో ప్రస్తావించారు ఆర్కే. రానున్న కాలంలో జగన్ బెయిల్ రద్దు అయ్యే పరిస్థితి వస్తే అందుకు కారణం జగన్ చేస్తున్న పనులే కారణం అవుతాయని కూడా హెచ్చరించారు.జైల్లోనుంచే పాలన సాగిస్తారని కూడా వ్యాఖ్యానించారు.
బయట పడిన అసలు రూపం..
జగన్ సీఎం అయ్యాక జిల్లా కలెక్టర్లు,ఎస్పీలతో ఏర్పాటు చేసిన మొదటి సమావేశాన్ని చూస్తే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందని భావించారని,రమణ ధీక్షితుల్లాంటివారు జగన్మోహన్రెడ్డిని శ్రీమన్నారాయణుడితో పోల్చేలా వ్యాఖ్యానించారని అయితే ఆ భ్రమలు తొలగేందుకు ఎంతో సమయం పట్టలేదని విమర్శించారు.జేసీబీ,పీసీబీని అస్త్రంగా చేసుకుని పాలన సాగిస్తున్నారని,కుబుసం జారిపోయాక అసలు రూపం బయటపడిందన్నారు.ఇలా తన వీకెండ్ కామెంట్లో పలు అంశాలను ప్రస్తావించారు.
కొత్తగా ఒక్క కంపెనీ కూడా..
‘ప్రజావేదికను,టీడీపీ నేతల నిర్మాణాలను మాత్రమే అక్రమ నిర్మాణం పేరుతో కూల్చేసి మిగతా వాటిని విస్మరించారు. మాజీ స్పీకర్ కోడెలపై ఏసీబీ ద్వారా కేసులు నమోదు చేయించి ఆయన ఆత్మహత్యకు పాల్పడే వరకు వేధించారు. జువారీ సిమెంట్స్,అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీలను మూసివేసేందుకూ సిద్ధమయ్యారు.మీరు వచ్చాక ఒక్క కంపెనీ అంటే ఒక్క కంపెనీ కూడా రాలేదు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాయలసీమకు అన్యాయం జరుగుతోందని చెప్పారు.కాని మీరు అధికారంలోకి వచ్చాక చేసిందేంటి.అసాధారణ మెజార్టీ వచ్చింది గనుక రాజ్యాంగం కూడా తనకు అడ్డురాకూడదని జగన్ నమ్ముతున్నారు.న్యాయవ్యవస్థలతో తలపడుతున్నారు.న్యాయమూర్తులను బ్లాక్ మెయిల్ చేసేందుకు వెనుకాడడం లేదు.కొందరు అధికారులు సైతం జగన్ మెప్పుకోసం ప్రయత్నించి న్యాయస్థానాలతో చివాట్లు తిన్నారు.తప్పులను సరిద్దుకోవాల్సిన జగన్ న్యాయ వ్యవస్థపైనే ఎదురుదాడికి సిద్ధపడ్డారు.
చంద్రబాబుపై కోపంతో..
కేవలం చంద్రబాబుపై కోపంతో,ఆయన జ్ఞాపకాలు ఉండకూడదన్న ఉద్దేశంతో రాజధాని అమరావతి ఉసురుతీసేందుకు సిద్ధమయ్యారు.రాజధానికి భూములు ఇచ్చిన రైతుల ఆందోళనను గుర్తించడం లేదంటే రైతుల పట్ల ఆయనకు ఎంత ద్వేషం ఉందో అర్థం చేసుకోవచ్చు.జగన్ సీఎం అయ్యాక రెండేళ్ల తరువాత కూడా రాష్రానికి రాజధాని లేని పరిస్థితి తెచ్చారు.ప్రత్యేక హోదా విషయంలో గతంలో జగన్ ఎన్నోచెప్పారు.ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ మాటే మర్చిపోయారు.నిన్నటి కంటే ఇవాళ,రేపు బాగుండాలనే అందరూ కోరుకుంటారు.కాని అది జరగాలంటే ఉద్యోగాలు రావాలి.పరిశ్రమలు లేని ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి.సంక్షేమం పేరుతో అప్పులు చేసి పంచడాన్నిఏ సామాజిక,ఆర్థిక శాస్త్రవేత్త కూడా సమర్థించడు.గతంలో రాయలసీమ వెనుకబాటు తనం గురించి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినవారు ఇప్పుడు సైలెంట్ అయ్యారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కంచాలు మోగించిన వాళ్లు మౌనం వహించారు.గత ప్రభుత్వం అమలు చేసిన ఐదు శాతం రిజర్వేషన్లను జగన్ సర్కారు తొలగించినా నోరెత్తడం లేదు.మేధావులు, తటస్థులుగా గతంలో చెప్పుకున్నవారు టీడీపీ ప్రభుత్వంపై చాలా విమర్శలు చేశారు.ఇప్పుడా గొంతుల్లో కొన్నింటికి పదవులు లభించాయి కాబట్టి సైలెంట్ అయ్యారు.
Must Read ;- జగన్ రెండేళ్ల పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లింది : చంద్రబాబు నాయుడు
న్యాయమూర్తులైనా సరే..
తమ జిల్లాలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరు స్వయంగా సినీ నటుడు సోనూ సూద్‌ను అర్థించారంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎల ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం ఎవరెవర్ని తిట్టాలో వారిని తిట్టడానికే కొందరు మంత్రులు,ఎమ్మెల్యేలు పరిమితమయ్యారు.వీటిపై ప్రశ్నించే వారిపై,వారు న్యాయమూర్తులైనా సరే నీలిమూక ఉన్మాదంతో విరుచుకుపడుతోంది.కడుపు మండినవాడు తన బాధను సోషల్ మీడియాలో పోస్టుల ద్వారా వ్యక్తం చేస్తే తప్పేంటని గతంలో జగన్ చెప్పారు.సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏమిటని గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్‌రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేంటి.ఐదేళ్ల పాలనలో చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం.మిగిలిన నాలుగేళ్లలో రెండేళ్లు పూర్తయింది.ఇంకా రెండేళ్లే మిగిలి ఉంది.రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే కాలం రెండేళ్లే మిగిలింది.ఆదాయం పెంచుకోకుండా, పంచుకుంటూ పోతే అప్పులు పుట్టవు.సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు.తెలంగాణ సీఎం కేసీఆర్ తాను అధికారంలోకి వచ్చిన కొత్తలో ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదు.వెరసి ధనిక రాష్ట్రమని చెప్పిన తెలంగాణ కూడా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది.దీంతో కేసీఆర్ అప్రమత్తమయ్యారు.ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైన జగన్మోహన్రెడ్డి ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది.స్థానిక సంస్థల ఎన్నికలు,తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో మెజార్టీ వచ్చింది గనుక ప్రజలను తన విధానాలకే ప్రజలు మద్దతు తెలిపారని జగన్ భావించి ఉండవచ్చు. తరువాతే సీఐడీని తనను విమర్శించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు పైకి ఉసిగొల్పారు.ఆ కేసులో రఘురామకృష్ణంరాజు కాలికి గాయాలైన అంశంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు గమనించాల్సి ఉంటుంది.ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టును కూడా నీలిమూక టార్గెట్ చేస్తోంది.
ఒక్క చాన్స్ ప్లీజ్ అంటూ..
ఒక్క చాన్స్ ప్లీజ్ అని అధికారంలోకి వచ్చాక జగన్‌రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారా లేక అప్రతిష్ఠ మూటగట్టుకున్నారా అంటే ఏం చెప్పాలి.ప్రస్తుతానికి జగన్ రెడ్డి బలంగా ఉన్నట్లు కనిపించవచ్చు.కాని అది ఎంత కాలం ఉంటుందో చెప్పలేని పరిస్థితి.151సీట్ల మెజార్టీ ఇచ్చిన ప్రజలకు జగన్ మంచి చేశారా? చెడు చేశారా ? పుణ్యం చేస్తున్నారా? పాపం చేస్తున్నారా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది.అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు ఆయన పుణ్యం ఖాతా నిల్వ కరిగిపోతోంది.రఘురామకృష్ణంరాజు విషయంతో పాటు మిగతా విషయాల్లో జగన్‌రెడ్డి వ్యవహారశైలి..ఆయన బెయిల్ రద్దు పిటిషన్ పైనా ప్రభావం చూపుతుంది.కక్ష సాధింపు చర్యల వల్ల జగన్‌రెడ్డికి రాజకీయంగా నష్టమేనన్న విషయం మర్చిపోవద్దు.బెయిల్ రద్దయినా జగన్ సీఎంగా చంచల్‌గూడ జైలు నుంచో లేక మరో జైలు నుంచో పాలన సాగించవచ్చు.అది రాష్ట్రానికి అవమానకరమే.అయితే దీన్ని కూడా నీలిమూకలు మరో రకంగా ప్రచారం చేస్తాయి.పేదల అభ్యున్నతికి కృషి చేస్తున్న జగన్‌ను పెత్తందారీ దుష్టశక్తులు అన్నీ కలసి జైలుకు పంపాయని ప్రచారం చేస్తాయి.సానుభూతి కోసం ప్రయత్నిస్తాయి.ఇలాంటి ఆలోచనల నుంచి జగన్ అండ్ కో బయటపడనంత వరకు ఏపీలో పరిస్థితి మారదు.’ అని ఆర్కే ఏకేశారు.ప్రధానంగా బెయిల్ రద్దయితే పరిస్థితి ఏంటనే విషయానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read ;- ‘మేం చెప్పిందే చట్టం.. చేసేదే న్యాయం’..!