ఏపీకి ప్రత్యేక హోదా విషయంతో పాటు మన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై వైఎస్ జగన్ వైఖరిపై ఏబీఎన్ రాధాకృష్ణ తూర్పారాబట్టారు. వీకెండ్ కామెంట్ బై ఆర్కే –కొత్త పలుకు లో పలు అంశాలను ప్రస్తావించారు. ఒక్క మాటలో చెప్పాంటే గతంలో ప్రత్యేక హోదా విషయంలో రచ్చచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎం అయ్యాక మర్చిపొమ్మని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల్లో ‘గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఊరూరా తిరిగి గొంతుచించుకున్నారు. బీజేపీతో ఒప్పదం కుదుర్చుకున్న సమయంలో ప్రత్యేక హోదా రాదన్న విషయం తెలిసినా అధికారంలోకి వచ్చేందుకు యువతను రెచ్చగొట్టారు. ప్రతి జిల్లా కేంద్రం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంపై పలు వ్యాఖ్యలు చేశారు.
రెంటికీ చెడగొట్టి..
గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చాలా ఆరోపణలు చేశారు. అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం చివరికి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారు. అప్పట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారంతో ఉక్కిరిబిక్కిరై అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీని కూడా వదులుకున్నారు. ఇప్పడు పరిస్థితి ఏంటి. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏదీ రాలేదు. చివరిగా రాష్ట్రం నష్టోపోయింది. అదే సమయంలో ప్రత్యేక హోదా అంశంపై ఇంకా ఆశలున్నాయని అధికార పార్టీ చెబుతుండడం మరో స్కెచ్ గా చెప్పవచ్చు. రానున్న కాలంలో మరోసారి ప్రత్యేక హోదాను ప్రచారం చేస్తారని చెప్పవచ్చు.
అభివృద్ధి చేయాలంటే..
అభివృద్ధి చేయాలంటే పాలకులకు చిత్తశుద్ది ఉండాలి. ఏపీకి ఏ హోదా ఉందని గతంలో కియా కంపెనీ వచ్చింది. ఏ హోదా ఉందని హైదరాబాద్ అభివృద్ధి చెందిందనేది ఆలోచించాలి. పెట్టుబడులను ఆకర్షించడానికి ఇతర రాష్ట్రాలు పోటీపడుతుంటే ఏపీలో అలాంటి వాతావరణం లేదు. వైజాగ్ లో ఏర్పాటు కావాల్సిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కంపెనీ కార్యాలయం కూడా దూరమైంది. ప్రశ్నించే వారిపై ఎదురుదాడి చేయడం, ఆ సంస్థ ఆర్థిక సంక్షోభంలో ఉందని ప్రచారం తప్ప ప్రభుత్వంవైపు నుంచి చొరవ లేదు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైల్లాంటి నగరాల్లో కార్యాలయాలు ఏర్పాటుచేసే ఆ సంస్థ విశాఖలో కార్యాలయం ఏర్పాటుచేసేందుకు ఒప్పుకుంది. గతంలో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఆ సంస్థ సీఈవో జెన్నిఫర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని విశాఖపట్నంలో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ఒప్పించారు. ఈ విషయంలో నీలి మూకకు, నీలి మీడియాకు ఏమైనా అనుమానాలుంటే ఆ కంపెనీని సంప్రదించవచ్చు. ఇక ఆ కంపెనీ పోతే వేరే కంపెనీ వస్తుందని చెప్పే పరిస్థితులు ఏపీలో లేవు.
Also Read ;- జగన్‌కు హింట్ ఇచ్చిన ABN ఆర్కే.. కమలదళం వ్యూహం అదేనా..?
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ..
పీపీఏల విషయంలో ప్రభుత్వ వైఖరి అంతర్జాతీయంగా తెలిసిపోయింది. సమావేశాలుకూడా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి. కంపెనీలు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామాల్లోనే రూ.ఐదువేలకు ఉద్యోగం ఇచ్చి ఉద్యోగ విప్లవం అని జగన్ ప్రభుత్వం సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చాలావరకు న్యాయస్థానాలు తప్పుబడుతున్నాయి. పంచాయతీ వ్యవస్థ ఉండగా సమాంతరంగా గ్రామ సచివాలయాలను ఎలా ఏర్పాటుచేస్తారని హైకోర్టు ప్రశ్నించిందంటే గ్రామ సచివాలయ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమే. ఇక అధికార పార్టీ నాయకులకు కోపం వస్తే చాలు వలంటీర్ల ఉద్యోగాలు పోతాయి. గ్రామీణ ప్రాంతల్లో ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమే. అయితే అందులో మోసం ఉండకూడదు. సంక్షేమం పేరుతో పంచుతున్నది ఎంత, పన్నులు పెంచి గుంజుతున్నది ఎంత అనేది ప్రజలు గమనించడం మొదలైంది. ఆస్తిపన్ను పెంచుతున్నారు కనుక ప్రజలకు వారి ఆస్తుల విలువ తెలియడానికే ఆ పని చేస్తున్నట్టు ప్రకటన ఇవ్వడం, మధ్యం విక్రయాలను తగ్గించడానికి మధ్యం ధర పెంచినట్టు చెప్పడం జగన్ సర్కారుకే చెల్లుతుంది.
కేంద్ర అభ్యంతరాలూ బేఖాతరు
ఇక ధిల్లీ వెళ్లిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సాధించిందేంటనేది తేలాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై కేంద్రం పలు అభ్యంతరాలు వ్యక్తం చసింది. కేంద్రం విడుదల చేసే నిధులకు ప్రత్యేక ఖాతాలు తెరవాలని, కేంద్రం నుంచి వచ్చే నిధులను ఆయా పథకాలకే వెచ్చించాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం ఇస్తున్న నిధులు దారి మళ్లడం ఇందుకు కారణంగా కనిపిస్తోంది. గతంలో సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనలను ఉద్దేశించి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి అసెంబ్లీలో పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కప్పిన శాలువాలు, బహూకరించిన వీణలతో బీరువాలు నిండిపోతున్నాయి తప్ప రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఇప్పుడు జరుగుతోంది కూడా అదే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధిల్లీ పర్యటనవల్ల ఏం సాధించారో చెప్పగలారా.
నడమంత్రపు సిరి..అధికారం తలకెక్కడం..
ఇక మాన్సాస్ ట్రస్ట్ విషయం, సింహాచలం దేవస్థాన ఛైర్మన్ విషయంలో ఏపీ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. సంచయిత నియామకాన్ని హైకోర్టు కొట్టేసింది. అయితే పూసపాటి అశోక్ గజపతిరాజు మళ్లీ ట్రస్ట్ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. సింహాచలం ఆలయానికి వెళ్లిన ఆయను అధికారులు అవమానించారు. మంత్రి వెలంపల్లి ఆదేశించినందునే తాము మర్యాదలు చేయలేదని అధికారులు చెప్పారంటే వెలంపల్లి శ్రీనివాస్ కు అధికారం తలకెక్కడం అంటే ఇదేనేమో. సింహాచలం దేవాలయానికి అశోక్ గజపతిరాజు కుటుంబం వేలాది ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చిందన్న విషయం గుర్తులేదా. గుళ్లు, గోపురాలు నిర్మించి భూరి విరాళాలు ఇచ్చిన వారినిక విజయవాడలో గుళ్లపై ఆధారపడి కొబ్బరికాయల వ్యాపారం చేసుకున్న శ్రీనివాస్ వంటి వారు అవమానించడం, పలు ఆరోపణలు చేయడం ఏంటి. ఇక ట్రస్ట్ భూములను అశోక్ గజపతిరాజు ఆక్రమించుకున్నారని, ఆయనను జైలుకు పంపుతామని ఎంపీ విజయసాయిరెడ్డి చెబుతున్నారు. నీతి, నిబద్ధత, నైతికత విషయంలో అశోక్ గజపతిరాజును విమర్శించే అర్హత విజయసాయిరెడ్డికి లేదు. అధికార ఉందని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అశోక్ గజపతిరాజు నిరాడంబర జీవితం గడుపుతారు. ఆస్తుల కోసం పాకులాడే వ్యక్తిత్వం కాదు. గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ విశాఖపట్నం వచ్చినప్పుడు అశోక్ తండ్రి పూసపాటి వెంకటగజపతి రాజు ముందు శిరసు వంచి నమస్కరించారంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
అశోక్ గజపతిరాజుపై వ్యక్తిగత ఆరోపణలా?
వ్యక్తిగత కక్షలతో, తనపై పిటిషన్ వేసి తమకు జైలుకి పంపించారన్న కక్షతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలా కక్షగట్టి ఉండవచ్చు. అయితే అశోక్ గజపతి రాజుపై ఆరోపణలు చేయడం అంటే సూర్యుడిపై ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమే అవుతుంది. ఇప్పుడు జగన్ రెడ్డి సీఎం అయి ఉండవచ్చు. వేల కోట్లు సంపాదించి ఉండొచ్చు. కాని విజయనగరం సంస్థానాన్ని ఏలిన వంశం అశోక్ గజపతి రాజుది. విజయ సాయిరెడ్డి వంటి వారు నడమంత్రంగా వచ్చిపడిన అధికారంతో అశోక్ గజపతిపై చేసే ఆరోపణలవల్ల అశోక్ గజపతిరాజు గౌరవానికి వచ్చే నష్టం ఏం లేదు. ఇక హైకోర్టు తీర్పు అనంతరం మంత్రులకు సద్బుద్ధిని, మంచి భాషను ప్రసాదించాలని దేవుడిని వేడుకుంటున్నట్టు అశోక్ గజపతిరాజు చెప్పారు. దేవుడిపట్ల ఏ మాత్రం నమ్మకం, భక్తి ఉన్నా వైఎస్ జగన్ తరహాలో ప్రవర్తించరు. ఏసు ప్రభువు కూడా క్షమాగుణాన్ని బోధించారు. ప్రతిరోజూ ఉదయం జగన్ బైబిల్ చదువుతారని చెబుతారు. అదే నిజమైతే కాని బైబిల్‌లో పేర్కొన్నదానికి భిన్నంగా జగన్ రెడ్డి వ్యవహరించకూడదు. పగ, ప్రతీకారాలతో మునిగితేలుతున్నారు. అయితే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారన్న విషయం మర్చిపోకూడదు.
Must Read ;- అధికారంతో చెలరేగుతున్నారు.. నీలి మూక అని ఏకేసిన ఆర్కే