దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలో బెంగళూరు యలహంక నివాసం వేదికగా సాగుతున్న ఆస్తుల రచ్చపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ సంచలన విశ్లేషణ చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల తన కుమార్తె అంజలీరెడ్డి వివాహాన్ని బెంగళూరులోని తన నివాసంలో జరిపించాలని భావించగా, పక్కనే నివసిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతా కారణాలు చూపిస్తూ లేఖ రాయడం వల్ల పెళ్లి వేదిక మారాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఒక కుటుంబ అంతర్గత వ్యవహారం కాదని, వైఎస్ఆర్ హయాంలో జరిగిన అక్రమ సంపాదన, బినామీ వ్యవస్థలకు ప్రత్యక్ష నిదర్శనమని ఆర్కే తన విశ్లేషణలో తేల్చి చెప్పారు.
బినామీ తెరపైకి భారతి తల్లి ‘సుగుణమ్మ’
బెంగళూరు యలహంకలో దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో జగన్, షర్మిల కోసం రెండు భారీ భవనాలు నిర్మించారని ఆర్కే గుర్తుచేశారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి కాకముందు ఆ కుటుంబానికి యలహంకలో ఎలాంటి ఆస్తులూ లేవు. అప్పట్లో ఆ స్థలం రికార్డుల్లో వ్యవసాయ భూమిగా ఉండటంతో, కర్ణాటక నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి కొనుగోలుదారు పేరిట దేశంలో ఎక్కడైనా వ్యవసాయ భూమి ఉండి తీరాలి. ఈ సాంకేతిక మెలికను దాటేందుకే వైఎస్ భారతిరెడ్డి తల్లి సుగుణమ్మను తెరపైకి తెచ్చి ఆమె పేరిట భూమిని కొనుగోలు చేయించారని విశ్లేషించారు. అంత భారీ ఆస్తి కొనుగోలు చేయడానికి సుగుణమ్మకు స్వార్జితం లేదని, వైఎస్సార్ సీఎంగా ఉన్న కాలంలో అక్రమంగా పోగేసిన సంపదతోనే ఆ స్థలం కొని భవనాలు నిర్మించారని, రికార్డుల్లో ఉన్న సుగుణమ్మ కేవలం బినామీ మాత్రమేనని ఆర్కే స్పష్టం చేశారు.
విజయసాయిరెడ్డి నోరు విప్పాల్సిందే!
ఈ బినామీ ఆస్తులు, కంపెనీల వెనుక అసలు సూత్రధారి, వ్యూహకర్త విజయసాయిరెడ్డేనని ఆర్కే ఆరోపించారు. అందుకే సీబీఐ కేసుల్లో ఆయన ఏ-2గా ఉన్నారని తెలిపారు. వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలోనే ఆస్తులు, కంపెనీలు అన్నీ జగన్ పేరిటే ఉంటే షర్మిల పరిస్థితి ఏమిటి? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించగా, మెల్లమెల్లగా గిఫ్ట్ డీడ్ల రూపంలో షర్మిలకు బదిలీ చేస్తామని సాయిరెడ్డి చెప్పినట్లు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోటస్ పాండ్తో పాటు బెంగళూరులోనూ జగన్, షర్మిలల కోసం రెండేసి భవనాలు పక్కపక్కనే కట్టినా, వాటి నిర్మాణ ఖర్చులకు ‘సోర్స్’ చూపించలేకే బినామీల పేరిట పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం ఈ భవనాలు ఒక్కొక్కటి రూ. 500 కోట్ల చొప్పున మొత్తం రూ. 1000 కోట్ల వరకు విలువ చేస్తాయని పేర్కొన్నారు.
అధికారం, అపరిమిత సంపదే కారణం
జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు, జైలుకు వెళ్లిన సమయంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల రోడ్డుపై బైఠాయించి, సుదీర్ఘ పాదయాత్రలు చేసి జగన్కు రాజకీయ లబ్ధి చేకూర్చారని గుర్తుచేశారు. కానీ ఆ తర్వాత సంపద, అధికారం వచ్చిపడటంతో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు భగ్గుమన్నాయన్నారు. రాజశేఖరరెడ్డి తన మరణాన్ని ఊహించకపోవడం వల్ల షర్మిల పేరిట ఆస్తులను నేరుగా బదిలీ చేయకపోవడమే నేటి వివాదానికి కారణమైందని, అదే ఆమె పేరిటే ఉంటే పెళ్లి జరిపించుకోవడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యేవి కావు అని అభిప్రాయపడ్డారు. కన్నతల్లి విజయమ్మ నిస్సహాయురాలై మానసిక క్షోభ అనుభవిస్తుంటే, కుటుంబ పెద్దగా జగన్ కొంత ఉదారత చూపి రక్తం పంచుకుపుట్టిన చెల్లికి న్యాయం చేయకపోవడం విచారకరమన్నారు.











