Road Accidents Of Sports Bikes :
సినిమా హీరోలకు ఖరీదైన కార్లు ఉన్నప్పుడు బైక్ రైడింగ్ ఎందుకో అర్థం కాదు. వీరికి ఖరీదైన బైక్ ల మీద విపరీతమైన మోజు ఉంటుంది. ఇలాంటి మోజు ఉన్న వారిలో చాలామంది హీరోలు ఉన్నారు. తమిళ హీరో అజిత్ ఏకంగా రేసింగ్ బైక్ లు వాడుతుంటారు. వాటిపై లాంగ్ డ్రైవ్ కు వెళుతుంటారు. హెల్మెట్ లు, జాకెట్ లు ధరించి ఉండటం వల్ల వారు మన పక్కనే ఉన్నా గుర్తించలేం. సాయిధరమ్ తేజ్ రాత్రి వాడిన బైక్ కూడా అత్యంత ఖరీదైనదే. ఒకవిధంగా చెప్పాలంటే త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి.
రోడ్డు మీద స్కిడ్ అయిన ఆ బైక్ మరో బైక్ నో, కారునో గుద్దినా, వెనక నుంచి కారు లాంటిదేదైనా వచ్చినా ప్రమాదం చాలా పెద్ద స్థాయిలో ఉండేది. ఇలాంటి బైక్ లతో రిస్క్ చేసి ప్రాణాలు కోల్పోయిన సినిమా సెలబ్రిటీలు కొందరున్నారు. నటుడు బాబూ మోహన్ తనయుడు కూడా ఇలానే ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మరో నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు కూడా ఇలాంటి బైక్ ప్రమాదంలోనే మృతిచెందాడు. అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్యకు కూడా బైక్ ల మీద మోజు ఎక్కువ.
అతను ఇలాంటి ఖరీదైన బైక్ లు వాడుతుంటాడు. ఆ కోవలోకే మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా వస్తాడు. సాయిధరమ్ తేజ్ వాడిన బైక్ ధర దాదాపు రూ. 20 లక్షలు ఉంటుంది. రోడ్ల మీద జనం పెద్దగా ఉండరనుకున్నప్పుడు ఈ బైక్ లను బయటకు తీసి అత్యంత వేగంతో వెళుతుంటారు. నిన్న ప్రమాదానికి గురైన స్పోర్ట్స్ బైక్ ను ఐదు నెలల క్రితమే కొనుగోలు చేశాడు. అది ట్రియాంఫ్స్ మోటార్ సైకిల్. ఈ స్పోర్ట్స్ బైక్ షోరూంలు దేశవ్యాప్తంగా 16 మాత్రమే ఉన్నాయి. అతనికి కార్ల మీద కన్నా బైక్ ల మీదే మోజు ఎక్కువ.
అతని చిన మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అతనికి ఓ ఖరీదైన బైక్ ను గిఫ్ట్ ఇచ్చారు. మరో బైక్ ను సాయిధరమ్ తల్లి విజయ దుర్గ బహుమతిగా ఇచ్చారట. మరో రెండు బైక్ లను సాయిధరమ్ తేజ్ కొనుగోలు చేశాడు. అతని దగ్గర మొత్తం నాలుగు బైక్ లు ఉన్నాయి. బైక్ మీద వారాంతంలో బయటికి వెళ్లటం అతనికి అలవాటు. ఇలాంటి బైక్ లు ఎవరు వాడినా స్పోర్ట్స్ వేర్ తప్పనిసరిగా వాడాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. కానీ సాయిధరమ్ సాధారణ దుస్తులో రైడింగ్ చేయడమే కాక హెల్మెట్ బెల్ట్ కూడా పెట్టుకోలేదని అంటున్నారు. దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో అతను బైక్ నడిపినట్టు చెబుతున్నారు.
ఇంత ప్రమాదం జరిగినా బైక్ పెద్దగా దెబ్బతినలేదు. ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో ఐసీయూలో ఉంచి అతనికి చికిత్స అందిస్తున్నారు. కాలర్ బోన్ విరిగినట్టు చెబుతున్నారు. డ్రైవింగ్ లో ఎంతో ప్రావీణ్యం ఉంటే తప్ప ఇలాంటి బైక్ లను నడపడం కష్టం. ఈ విషయంలో సాయిధరమ్ కు కూడా మంచి ప్రావీణ్యం ఉందని చెబుతున్నారు. రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల బైక్ జారి పడిపోయిందని అంటున్నారు. సినిమా రంగంలో ఉండే యువ హీరోలు ఇలాంటి బైక్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్రం ఈ ప్రమాదం హెచ్చరిస్తోంది.
Must Read ;- సాయిధరమ్ బైక్ ప్రమాదంలో తప్పెవరిది?