ఏపీలో నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ జగన్ సర్కారు శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే సారి ఏకంగా 135 సంస్థలకు సంబంధించి నామినేటెడ్ పదవులను భర్తీ చేసిన జగన్ సర్కారు.. అందులో భాగంగా ఒకటి అరా కీలక నిర్ణయాలు తీసుకుంది. నిన్నటిదాకా ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా కొనసాగిన చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆ పదవి నుంచి తప్పించారు. తాజాగా ఆ పదవిని మెట్టు గోవింద రెడ్డికి కట్టబెట్టారు. అదే సమయంలో జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న తూర్పు గోదావరి జిల్లా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. ఈ పదవిలో కొత్తగా కృష్ణా జిల్లాకు చెందిన అడపా శేషును నియమించారు. ఈ రెండు నియాకాలతో జగన్ కేబినెట్ లో మార్పులు తప్పని సరి అన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
ఇద్దరికీ మంత్రి పదవుల్లేవ్
జగన్ పార్టీ విపక్షంలో ఉండగా.. ఆ పార్టీ తరఫున రోజా ఓ రేంజిలో ఫైట్ చేశారు. ఏకంగా అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్ కు గురయ్యారు. అయినా కూడా రోజా ఎక్కడా వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి రాగానే.. రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అని, హోం మంత్రిత్వ శాఖను ఆమెకే కేటాయిస్తారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఎందుకనో గానీ.. రోజాకు జగన్ కేబినెట్ బెర్త్ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించినా రోజా పెద్దగా సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కనిపించలేదు. మరోవైపు జక్కంపూడి ఫ్యామిలీ ఆది నుంచి వైఎస్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు నెరపుతున్న సంగతి తెలిసిందే. జక్కంపూడి రామ్మోహన్ రావు వైఎస్సార్ తో కలిసిపోయినట్లుగా రాజా కూడా జగన్ తో బాగానే కలిసిపోయారు. ఈ క్రమంలో రాజాకు కూడా జగన్ కేబినెట్ లో చోటు ఖాయమే అనుకున్నారు. అయితే ఆయనకు కూడా రోజా మాదిరే మొండి చేయి చూపించిన జగన్.. ఆ తర్వాత కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.
వారి కోసం ఎవరిని తప్పిస్తారో?
తాజాగా ఇప్పుడు అటు రోజాతో పాటు ఇటు రాజాను నామినేటెడ్ పదవుల నుంచి తప్పించిన నేపథ్యంలో.. త్వరలో జరగనున్న కేబినెట్ రీషఫిలింగ్ లో వారిద్దరికీ మంత్రి పదవులు ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. రోజా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే.. రాజా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. మరి వీరిద్దరికీ మంత్రిమండలిలో చోటు దక్కుతుందంటే… ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన వారిలో ఓ ఇద్దరిపై వేటు తప్పదు కదా. అందుకే కాబోలు..జగన్ లెక్కలు అర్థమైన కొందరు మంత్రులు.. రోజా, రాజాలకు పదవుల దెబ్బ ఎవరిపై పడుతుందన్న విషయంపై తమదైన శైలిలో ఈక్వేషన్లను చెబుతున్నారు. ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన మంత్రుల్లో మాత్రం టెన్షన్ మొదలైపోయింది.
Must Read ;- వైరల్ జోస్యం!.. జగన్, రఘురామ భవిష్యత్తు ఏంటీ?











