ఆర్.కె. రోజా నటనకు వీడ్కోలు పలికారు.ప్రముఖ టీవి ప్రోగ్రాం జబర్దస్త్ వేదికగా ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు.ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆమెకు మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆమె షూటింగ్ లలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపారు.
2004 లో రాజకీయాల్లోకి వచ్చిన రోజా తొలత తెలుగుదేశం అభ్యర్ధిగా నగరి నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆమె విజయం సాధించలేకపోయారు. 2014 , 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన రోజా రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ మొదటి క్యాబినెట్ లో రోజాకు బెర్త్ లభిస్తుందని భావించినప్పటికీ రాలేదు. కాగా ఇటీవల జరిగిన రెండవ మంత్రివర్గ కూర్పులో రోజాకు ఆ అవకాశం లభించింది. దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె నటనకు వీడ్కోలు పలికారు. ఇదే అంశాన్ని తాను జడ్జ్ గా వ్యవహరిస్తున్న తవ షో జబర్దస్త్ వేదికగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ఎంతో మంచి పేరు తెచ్చిన జబర్దస్ట్ కార్యక్రమాన్ని వదులుకోవడం బాధేస్తోందని అన్నారు. ఇక రోజా పాల్గొన్న చివరి ఎపిసోడ్ కావడంతో యూనిట్ మొత్తం రోజాకు ఘనంగా వీడ్కోలు పలికారు.











