బోరుగడ్డ అనిల్ కుమార్… ఈ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంత ఫేమప్ అయిన ఈయన ఏ పదవిలో ఉన్నారు?..అసలు ఈయన వృత్తి ఏమిటి? అని ఆరా తీయాల్సిన పనిలేదు. ఎందుకంటే… గుంటూరు నగరానికి చెందిన అనిల్ ఓ రౌడీ షీటర్. ఓ రౌడీ షిటర్ కు ఇంత బిల్డప్పా అంటే తప్పలేదు మరి. దేశ రాజకీయాల్లో రిపబ్లికన్ పార్టీ ఆప్ ఇండియా పేరిట కొనసాగుతున్న ఓ పార్టీకి తాను ఏపీ అధ్యక్షుడినని చెప్పుకునే అనిల్… వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకుంటాడు. జగన్ సీఎం కాగానే… సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయిన అనిల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
జగన్ ఒక్కమాట చెబితే నాడు విపక్షనేతగా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లను చంపే*స్తానని అనిల్ సంచలన ప్రకటన చేశాడు. ఈ ప్రకటన అతడికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది, ఆ తర్వాత చంద్రబాబు కుటుంబ సభ్యులతో పాటు జనసేనాని పవన్ కల్యాణ్, నెల్లూరు రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలపైనా అతడు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలపై నాడు పోలీసులకు ఫిర్యాదు అందినా… వైసీపీ అధికారంలో ఉండటంతో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఆతర్వాత గుంటూరు పరిధిలో బెదిరింపులకు,దౌర్జన్యాలకు కూడా అతడు తెర తీశాడు. ఇలా 2021లో గుంటూరుకు చెందిన కర్లపూడి బాబు ప్రకాశ్ ను బెదిరించిన అనిల్ తనకు రూ.50 లక్షలు ఇవ్వాలంటూ కోరాడు. దీనిపై బాబు ప్రకాశ్ పోలీసులను ఆశ్రయించగా… పట్టాభిపురం పోలీసులు అనిల్ పై కేసు నమోదు చేశారు. ఆ కేసులోనే ఇప్పుడు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇటీవలే టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే.. అరెస్ట్ భయంతో అనిల్ అండర్ గ్రౌండ్ వెళ్లిపోయాడు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కొంత కాలం పాటు తలదాచుకున్న అనిల్ ఇటీవలే గుంటూరులోని తన నివాసానికి చేరుకున్నారు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు బుధవారం రాత్రి అతడిని అరెస్ట్ చేశారు. అయితే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన అనిల్ కు స్టేషన్ లో పోలీసులు రాచమర్యాదలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్నితెలుసుకున్న టీడీపీ శ్రేణులు నల్లపాడు పోలీస్ స్టేషన్ చేరుకుని రౌడీ షీటర్ కు రాచమర్యాదలేమిటని పోలీసులను నిలదీశారు.