ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా సీఎం చంద్రబాబు నాయుడు వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సుడిగాలి పర్యటనలు గ్రామీణ, పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోశాయి. ఒకవైపు గ్రామసీమల బాగు కోసం పల్లె పండుగ 3.0 ప్రారంభించడం, మరోవైపు వెనుకబడిన రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే రాయలసీమ రైజింగ్ హర్టికల్చర్ హబ్, పేదల సొంతింటి కల నెరవేర్చే గృహ పంపిణీ..ఇలా ప్రతి సభలోనూ సీఎం చేసిన ప్రకటనలు రాష్ట్ర అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించాయి.
పల్లె ప్రాంతాల రూపురేఖలను సమగ్రంగా మార్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రారంభించిన పల్లె పండుగ 3.0 కింద ఏకంగా రూ. 11,085 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో 15,500 కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రహదారుల నిర్మాణం, పాడి రైతులకు ఆసరాగా 22,000 మినీ గోకులాల ఏర్పాటు, పంచాయతీ భవనాల పటిష్ఠత వంటి పనులతో పల్లెలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని ఆయన స్పష్టం చేశారు. దీనికి అనుబంధంగా జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి పల్లెలోని ఇంటికీ స్వచ్ఛమైన కుళాయి నీరు అందిస్తూ, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే పనులను కూడా వేగవంతం చేశారు.
రాయలసీమను గ్లోబల్ మ్యాప్‌పై నిలబెట్టే లక్ష్యంతో రాయలసీమ రైజింగ్ – గ్లోబల్ హార్టికల్చర్ హబ్ బృహత్ ప్రణాళికను ప్రకటించడం ఈ పర్యటనల్లో ప్రధాన ఆకర్షణ. సీమను లక్ష కోట్ల ఉద్యానవన ఆర్థిక వ్యవస్థగా మలచి, వేలాది మంది రైతులకు స్థానిక ఉపాధిని కల్పించే రీతిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, విదేశీ ఎగుమతుల నెట్వర్క్ ఏర్పాటుపై సీఎం దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో పేదలకు పట్టాభిషేకం ద్వారా 3 లక్షల గృహాల నిరాటంక పంపిణీకి సీఎం అనుమతి తెలిపారు, పేదవాడికి సొంతిల్లు అనేది హక్కు అని పునరుద్ఘాటించారు.
పాలన అంటే ఆదేశాలకు పరిమితం కాకుండా, ప్రగతి ఫలాలు ప్రతి పేదవాడి గడపకూ చేరేలా జవాబుదారీతనంతో పనిచేయడమే తమ ప్రభుత్వ విధానమని మరోసారి నిరూపించారు సీఎం చంద్రబాబు. అమరావతి, పోలవరం పనులకు కేంద్రం సాయం, గ్రామీణ స్వపరిపాలన బలపడటం, రాయలసీమ పారిశ్రామిక వికాసం ముడిపడి ఉన్న వారం రోజుల పర్యటనలు, సీఎం నిర్ణయాలు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేస్తాయని కచ్చితంగా చెప్పొచ్చు.











