మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హ*త్యకు వినియోగించిన రూ.40 కోట్ల సుపారీ మూలాలు ఎక్కడ ఉన్నాయో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పష్టంగా తెలుసని, దీనిపై ఆయన వెంటనే నోరు విప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, MLC వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈ కేసులోని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వర్ల రామయ్య ప్రస్తావించారు.
వివేకానందరెడ్డి హ*త్య కేసులో కీలక ఆధారాలు, సమాచారం కలిగిన సాక్షులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా అనుమానాస్పద రీతిలో మృ*తి చెందుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు వర్ల రామయ్య. గతంలో వైఎస్ జగన్‌ను హైదరాబాద్ నుంచి పులివెందులకు తీసుకెళ్లిన డ్రైవర్ కూడా అనుమానాస్పద స్థితిలోనే ప్రాణాలు కోల్పోయాడని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు రావడం తీవ్ర సంచలనం రేపుతోందని, కేసు విచారణ కీలక దశకు చేరుకుందనడానికి ఇది స్పష్టమైన నిదర్శనమని అన్నారు.
ఈ కేసులో చోటుచేసుకున్న వరుస అనుమానాస్పద మరణాలు, రూ.40 కోట్ల సుపారీ లావాదేవీల వెనుక ఉన్న అసలు హస్తం ఎవరిదో నిగ్గు తేల్చడానికి నిష్పాక్షిక విచారణ జరగాలని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు అందిన నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల మూలాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, బాబాయ్ హ*త్య వెనుక ఉన్న అసలు సూత్రధారులు, పాత్రధారులు చట్టం ముందు నిలబడక తప్పదన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.3,500 కోట్ల భారీ మద్యం కుంభకోణంపైనా వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ అక్రమ మద్యం వ్యవహారంలో ప్రధాన బాధ్యత, వేళ్లన్నీ నేరుగా వైఎస్ జగన్ వైపే చూపిస్తున్నాయని ఆరోపించారు. ఒకవైపు బాబాయ్ హత్య కేసులో ED దర్యాప్తు స్పీడందుకోవడం, మరోవైపు రూ.3,500 కోట్ల మద్యం కుంభకోణం బయటపడడంతో వైసీపీ అగ్రనేతల అసలు రూపం త్వరలోనే బట్టబయలవుతుందన్నారు.











