మీరు విన్నది నిజమే. సర్కారీ బడిలో చదువుకుంటున్న ఓ విద్యార్థి యూనిఫాం కోసం దరఖాస్తు చేసుకుంటే.. అతడి ఖాతాలో ఏకంగా రూ.900 కోట్లు జమ అయ్యాయి. అతడితో పాటు యూనిఫాం కోసం దరఖాస్తు చేసుకున్న ఇంకో విద్యార్థి ఖాతాలో అంత అధిక మొత్తం కాకున్నా.. రూ.6.2 కోట్లు జమ అయ్యాయి. అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసిన ఈ ఘటన ఏ విదేశంలోనే జరగలేదు. మన దేశంలోని బీహార్ లోనే చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థుల గ్రామస్తులు తమ ఖాతాల్లో కూడా ఇలా భారీ మొత్తాల్లో డబ్బు జమ అయ్యిందేమోనన్న భావనతో సమీపంలోని బ్యాంకు, ఏటీఎంల ముదు క్యూలు కట్టారట. అమితాసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటనకు బ్యాంకు సర్వర్లలో సాంకేతిక లోపం కారణమని ఆలస్యంగా తేలింది.
ఏం జరిగిందంటే..?
బీహార్ లో సర్కారీ బడుల్లో చదువుకుంటున్న విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాల కొనుగోలు కోసం నిధులు అందించే ఓ పథకం అమలు అవుతోంది. ఈ పథకానికి విద్యార్థులే నేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల వివరాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నగదును జమ చేస్తుంది. ఈ పథకం కోసం అందరి మాదిరే కటిహార్ అనే పట్టణానికి చెందిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఇద్దరు విద్యార్థులు తమ ఖాతాల్లో ఆ స్కీం నిధులు జమ అయ్యాయో, లేదోనని చూసుకునేందుకు ఇంటర్నెట్ ను ఆశ్రయిస్తే.. ఓ విద్యార్థి ఖాతాలో ఏకంగా రూ.900 కోట్లు జమ అయినట్టుగా తేలిందట. ఇంకో విద్యార్థి ఖాతాలో రూ.6.2 కోట్లు జమ అయ్యాయట. దీంతో షాక్ తిన్న ఆ విద్యార్థులు తమ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన ఆన్‌లైన్ స్టేట్ మెంట్లను ప్రింటవుట్ తీసుకుని తమ కుటుంబ సభ్యులకు తెలిపారట. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు కూడా తమ ఖాతాల్లో కూడా ఇలాగే నిధులు జమ అయ్యాయేమోనని చెక్ చేసుకునేందుకు బ్యాంకులు, ఏటీఎంలు, ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు పెట్టారట.
వాస్తవమేంటంటే..?
ఆ విద్యార్థుల ఖాతాల్లో భారీ మొత్తంలో నిధులు జమ అయినట్టుగా ఆన్ లైన్ స్టేట్ మెంట్ లో చూపిస్తున్నా.. వారి ఖాతాల్లో మాత్రం చిల్లిగవ్వ కూడా లేదట. ఇదే విషయాన్ని ఆ విద్యార్థుల ఖాతాలున్న ఉత్తర బిహార్ గ్రామీణ బ్యాంకు శాఖ మేనేజర్ ధ్రువీకరించారు. బ్యాంకు సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇలా జరిగిందని ఆయన చెప్పారు. నిజానికి సదరు విద్యార్థుల ఖాతాల్లో డబ్బు లేదని, కానీ అకౌంట్ స్టేట్‌మెంట్‌లో మాత్రం అంత సొమ్ము ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. అయితే ఆ చిన్న టెక్నికల్ మిస్టేక్ ఇంత పెద్ద దుమారానికి కారణమైందన్న మాట.
Must Read ;- జగన్ ను నమ్మి అమూల్ నిండా మునిగిందే!










