తన తొలి చిత్రం ఏ మాయ చేశావే తోనే కుర్రకారు మనసులు కొల్లగొట్టింది మలయాళ కుట్టి సమంత. అందం, అభినయం కలబోసుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగునాట తకదిమితై తాళాలకు చిందులేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు, అత్తారింటికి దారేది, బృందావనం మొదలు మొన్నటి ఓ బేబీ, జానూ, రంగస్థలం వరకు తన దరికి చేరిన ప్రతీ అవకాశం సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. తెలుగులో యువహీరోలతోనే కాకుండా, పవన్ కళ్యాణ్ వంటి అగ్రహీరోలతో జతకట్టిన ఈ అమ్మడు తాను నటించిన ప్రతీ పాత్రకు న్యాయం చేయాలని తపించింది. ఒక్క తెలుగులోనే కాదు, తమిళ చిత్రాల్లోనూ మెరిసి అందరి మన్ననలు పొందింది.
అభినయంతో పాటు అందాల ఆరబోతతో యువతను ఉర్రూతలూగించిన ఈ గ్లామర్ డాల్ ఇవాళ ఆమె 35వ పడిలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్స్ తో తీరిక లేకుండా బిజీ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కాశ్మీర్ లో ఉంది. ఇక తన 35 వ పుట్టినరోజు వేడుక గుర్తుండిపోవాలని అనుకున్న ఈ అమ్మడు తన బర్త్ డే సెలబ్రేషన్స్ ను కశ్మీర్ లో సెలబ్రేట్ చేసుకుంది. ఆ సెలబ్రేషన్స్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను సామ్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇప్పుడవి నెట్టింట వైరల్ గా మారాయి.
సమంత పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. కాగా, టాలీవుడ్ స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పిన వెరైటీ విషెస్ ఆసక్తికరంగా మారింది. సమంత అంటే తనకు ఎంతో ఇష్టమని సాయి తేజ్ ఎన్నోసార్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఆ అభిమానాన్ని పుట్టినరోజు శుభాకాంక్షలతో చాటుకున్నాడు ధరమ్ తేజ్.
‘‘జెస్సీ.. నువ్వు ఏం మాయ చేశావో కానీ.. ఎటో వెళ్లిపోయింది మనసు.. పుట్టిన రోజు శుభాకాంక్షలు సామ్.. నీ వీరాభిమాని’’ అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు. అంతేకాదు.. సామ్ నవ్వుతూ అందంగా కనిపించే బ్లాక్ అండ్ వైట్ ఫొటోను తన శుభాకాంక్షలకు జోడించాడు. ఇప్పుడు అతడు చెప్పిన విషెస్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఇక నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత తన తొలిపుట్టినరోజును జరుపుకొంటోంది. అదేసమయంలో సామ్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి,తమన్నా, నీరజ కోన, దివ్య దర్శిని, కీర్తి సురేశ్, త్రిష, కంగనా రనౌత్, రష్మిక, రకుల్ ప్రీత్ సింగ్, వెన్నెల కిషోర్, వరుణ్ ధవాన్, ఉపాసన, పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు శుభాకాంక్షలతో ఆమెను ముంచెత్తారు. ఇక, చిన్న కుటుంబం నుంచి వచ్చి అంతెత్తుకు ఎదగడం.. ఎదిగిన తర్వాత లేని వారికి సేవ చేయడంలో అందరికీ సమంత స్ఫూర్తి అంటూ అభిమానులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.