‘‘ఓ మాట చెప్పామంటే.. ఆ మాటను అమలు చేయడానికి ఎంతదాకా అయినా వెళతాం. మాట తప్పం… మడమ తిప్పం’’ అని ఏపీ సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు. ఎన్నికలకు ముందు రోజూ అదే పదం పాడిన జగన్… తన సీఎం కల నెరవేరగానే… దాని ఫ్రీక్వెన్సీని తగ్గించేశారు. రెండేళ్ల పాలన ముగిసిన తర్వాత అసలు ఆ మాట జగన్ నోట నుంచే వినిపించడం లేదు. జగన్ తీరు ఇలా ఉంటే… ఆయన ముఖ్య అనుచరులు, అనుంగులు, తెర వెనుక ఉండి మొత్తం వ్యవహారాన్ని నడిపించే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వారు ఏకంగా ఆ మాటనే మార్చేశారు. ఏకంగా జగన్ ‘మడమ’నే తిప్పేశారు. ఈ తరహా వాదనలు ఇప్పుడు ఏపీలో నిత్యకృత్యమైపోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
టీడీపీ మెజారిటీతో బెంబేలు
ఇప్పుడీ మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే… ఏపీలో అసెంబ్లీతో పాటు తమకు అవసరం లేదంటూ జగన్ తీర్మానించిన శాసన మండలి కూడా ఉంది కదా. నిన్నటి వరకు మండలిలో విపక్ష టీడీపీదే మెజారిటీ. ఈ క్రమంలోనే జగన్ సర్కారు తీసుకున్న పలు అసంబద్ధ నిర్ణయాలను మండలిలో టీడీపీ అడ్డుకున్నట్లు ఆసక్తికర వాదనలు వినిపించాయి. జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లును తిప్పి పంపిన సమయంలో మండలిలో జరిగిన రచ్చ అంతాఇంతా కాదనే చెప్పాలి. ఈ సందర్భంగా అసలు మండలి తమకు అవసరమే లేదని జగన్ స్వయంగా చెప్పేశారు. మండలి నిర్వహణ వృథా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్… మండలిని రద్దు చేయాలంటూ కేంద్రానికి తీర్మానం పంపారు. తన ఢిల్లీ పర్యటనల్లో ఈ అంశాన్ని కేంద్రం వద్ద జగన్ ప్రస్తావిస్తున్నట్లుగానే వైసీపీ వర్గాలు చెప్పుకుంటూ వస్తున్నాయి.
మాట మార్చేశారు
ఇలాంటి కీలక సమయంలో ‘‘అబ్బే… అదేమీ లేదండి. మేము మండలి రద్దు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురాబోం. ప్రత్యేక హోదాను అడిగినట్టుగా పదే పదే కేంద్రం వద్ద మండలి రద్దు ప్రస్తావనను తీసుకురాబోం’’ అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వేళ తాము ఇదివరకే పంపిన ప్రతిపాదన మేరకు కేంద్రమే మండలిని రద్దు చేస్తే మాత్రం ఆ ప్రకారమే నడుచుకుంటామని కూడా సజ్జల సెలవిచ్చారు. మరి దీని భావమేంటని ఎవరిని అడిగినా? ఏం చెబుతారు? మండలి రద్దుకు వైసీపీ సిద్ధంగా లేదనే కదా ఎవరైనా చెప్పేది. అంటే జగన్ సర్కారు మాట తప్పినట్టే కదా. మడమ తిప్పినట్టే కదా. మరి జగన్ సర్కారు ఈ మడమ తిప్పడం వెనుక ఉన్న కారణాలేంటంటే… మొన్నటిదాకా మండలిలో టీడీపీది మెజారిటీ అయితే ఇప్పుడు ఆ మెజారిటీ వైసీపీ చెంతకు మారింది. వెరసి మండలి రద్దైతే… పదవుల కోసం వైసీపీలో అగ్గి రాజుకోవడం ఖాయమే కదా. అందుకే… అగ్గి రాజేయడం కంటే మాట తప్పడమే, మడమ తిప్పడమే మేలన్నట్లుగా జగన్ తన తీరును మార్చుకొన్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
Must Read ;- మెజార్టీ ఉందిగా.. మండలిని రద్దు చేయండి